- ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ
- అత్యంత ప్రమాదకరం, విరుగుడు లేదని నిపుణుల కమిటీ సిఫారసు
- 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా ప్రమాదకరమైన పురుగుమందు పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిడ్నీలు, ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతున్న ఈ విషపూరిత రసాయనం దిగుమతి, తయారీ, రవాణా, పంపిణీ, అమమ్మకాలును కీటకనాశన చట్టం–1968 ప్రకారం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పురుగుమందు వల్ల మానవాళికి, జంతుజాలానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. పారాక్వాట్ డైక్లోరైడ్ కీటక నాశిని/కలుపు సంహారిణి వినియోగాన్ని కొనసాగించాలా? వద్దా అనే అంశంపై మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 14న ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్టు ఈ నోటిఫికేషన్ లో జాయింట్ సెక్రటరీ ముక్తానంద్ అగర్వాల్ పేర్కొన్నారు. కీటకనాశన చట్టం–1968 లోని సెక్షన 5 కింద ఏర్పాటైన ఈ కమిటీ దేశ వ్యాప్తంగా సంప్రదింపులు జరిపినట్టు పేర్కొన్నారు.
ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం జూన్ 12న కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. గడ్డి మందుపై ఆ కమిటీ అధ్యాయనాలు, డేటా, భద్రతా, ఆందోళనకు సంబంధించిన సిఫారసులు చేసింది. మానవ, జంతు ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 70 కి పైగా దేశాలు దీనిని నిషేధించాయని తెలిపింది. ఈ రసాయనాల వల్ల ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలు, విష ప్రయోగ సంఘటనలు, నమోదైన అత్యధికర మరణాలు, దీనికి విరుగుడు కూడా లేదన్న అనేక ఆందోళనకర అంశాలను కమిటీ తన సిఫారసుల్లో గుర్తించింది. ప్రజారోగ్య రక్షణ దృష్ట్యా దీనిపై తక్షణమే నిషేధం విధించడమే శ్రేయస్కరమని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కాగా.. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో వాటిని సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆ అభ్యంతరాలు, సూచనలను కేంద్రం పరిశీలిస్తుందని పేర్కొంది.
ముసాయిదాలోని అంశాలు..
ఈ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి దిగుమతి, తయారీ, రవాణా, పంపిణీ, అమమ్మకాలు, వినియోగంపై నిషేధం నమోదు పత్రాల రద్దు: ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చిన తేదీ నుంచి పారాక్వాట్ డైక్లోరైడ్‌కు సంబంధించి గతంలో మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లన్నీ రద్దయినట్టుగానే భావిస్తారు. మూడు నెలల గడువు: తయారీదారులు లేదా డీలర్లు తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మూడు నెలలలోపు రిజిస్ట్రేషన్ కమిటీకి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
గడువులోగా వెనక్కి ఇవ్వని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. రాష్ట్రాలదే బాధ్యత: ఈ నిషేధ ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చట్టప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
