కళ్లు చెదిరే రేంజ్‎కు పెరిగిన IPL బ్రాండ్ వాల్యూ.. ముంబై, చెన్నైని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‎కు ఆర్సీబీ

కళ్లు చెదిరే రేంజ్‎కు పెరిగిన IPL బ్రాండ్ వాల్యూ.. ముంబై, చెన్నైని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‎కు ఆర్సీబీ

న్యూఢిల్లీ: క్యాచ్ రిచ్ లీగ్ ఐపీఎల్‎కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. క్రికెట్ ఆడే దేశాల్లో ఐపీఎల్ అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంత క్రేజ్ ఉన్న ఐపీఎల్ విలువ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఈ విషయాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ వెల్లడించింది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకే తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఐపీఎల్ వ్యాపార విలువ 12.9 శాతం పెరిగి 18.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

గత సంవత్సరం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 13.8% పెరిగి 3.9 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. My11circle, Angel One, RuPay, CEATకు నాలుగు అసోసియేట్ స్పాన్సర్ స్లాట్‌లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.1,485 కోట్లు ఆర్జించిందని బ్యాంక్ హౌలిహాన్ వెల్లడించింది. టాటా గ్రూప్‌తో ఐపీఎల్ టైటిల్-స్పాన్సర్‌షిప్ హక్కులను 2028 వరకు రూ. 2,500 కోట్లకు ఒప్పందం చేసుకుంది.

ఇక, ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే 2025 టోర్నీ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 269 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. -ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ గత సంవత్సరం 227 మిలియన్ డాలర్ల ఉంది. రెండవ స్థానంలో టోర్నీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ నిలిచింది. 2025లో ముంబై బ్రాండ్ విలువ  242 మిలియన్లకు పెరగగా.. 2024లో 204 మిలియన్లు ఉంది.

 చెన్నై సూపర్ కింగ్స్ 235 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2025 ఐపీఎల్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ బ్రాండ్ విలువ ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2024 కంటే పంజాబ్ బ్రాండ్ విలువ 39.6% పెరిగింది. వీక్షకుల సంఖ్య విషయానికి వస్తే IPL 2025 ఫైనల్‌ను జియో హాట్‌స్టార్‌లో 67.8 కోట్లకు పైగా వీక్షించారు. -ఇది 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఎక్కువ వ్యూయర్ షిప్.