మీ వాళ్లతో కలిపిస్తం.. ఇండియాకు ఇరాన్ హామీ..

మీ వాళ్లతో కలిపిస్తం.. ఇండియాకు ఇరాన్ హామీ..
  •     కార్గో షిప్​లో బంధీగా 17 మంది ఇండియన్స్
  •     జైశంకర్​తో మాట్లాడిన ఇరాన్ ఫారిన్ మినిస్టర్

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్​కు చెందిన ‘ఎంఎస్‌‌సీ ఏరిస్‌‌’ కార్గో షిప్ శనివారం నుంచి ఇరాన్​కు చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్​జీఎస్) ఆధీనంలోనే ఉన్నది. షిప్​లో మొత్తం 25 మంది సిబ్బంది ఉంటే.. అందులో 17 మంది భారతీయులు ఉన్నారు. మన గవర్నమెంట్ రిక్వెస్ట్​ చేయడంతో 17 మందిని ఇండియన్ ఎంబసీ అధికారులు కలిసేందుకు ఇరాన్ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అమిర్ అబ్దుల్లా.. మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​తో సోమవారం ఫోన్​లో మాట్లాడారు. 

ఇండియాకు చెందిన పలువురు అధికారులను.. బందీలుగా చిక్కిన 17మంది ఇండియన్లతో భేటీకి త్వరలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న షిప్ వివరాలను తెలుసుకుంటున్నామని జైశంకర్​కు అబ్దుల్లా వివరించారు. త్వరలోనే భేటీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. అందరూ సేఫ్​గానే ఉన్నారని తెలిపారు. అదేవిధంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు చర్చించుకున్నట్టు తెలిసింది. ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని అబ్దుల్లాకు జైశంకర్ సూచించినట్టు సమాచారం. 

ఈ విషయమై జైశంకర్ మీడియాతో మాట్లాడారు. షిప్​లో బందీగా ఉన్న 17 మంది ఇండియన్ల విషయంలో ఇరాన్ సానుకూలంగా స్పందించిందన్నారు. ఇరాన్​లోని ఇండియన్ ఎంబసీ అధికారులు వారితో కలిసి మాట్లాడుతారని వివరించారు. వారందరినీ వెంటనే రిలీజ్ చేయాలని కోరినట్టు తెలిపారు. త్వరలోనే వాళ్లంతా ఇండియాకు చేరుకుంటారని వారి కుటుంబ సభ్యులకు జైశంకర్ హామీ ఇచ్చారు. 

కాగా, గత శనివారం హర్మూజ్‌‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన కార్గో షిప్ ‘ఎంఎస్‌‌సీ ఏరిస్‌‌’ను ఐఆర్‌‌జీఎస్ హెలికాప్టర్లతో వెంబడించి ఆధీనంలోకి తీసుకున్నది. షిప్​లో 17 మంది ఇండియన్స్ ఉండటంతో ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ మాట్లాడారు. 17 మంది భారతీయులతో కలిసేందుకు అనుమతివ్వాలని కోరగా.. ఇరాన్ సానుకూలంగా స్పందించింది.