వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ చేసిన దాడులతో అమెరికా భారీగా నష్టపోనుంది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ జరిపిన దాడులకు యుద్ధ విమానాలతోపాటు అనేక యుద్ధ పరికరాలు డెబ్బతిన్నాయి. దీంతో వాటిల్లే నష్ట తీవ్రత గతంలో వేసిన అంచనా కంటే భారీగా ఉండొచ్చని తాజా నివేదిక స్పష్టం చేసింది.
పర్షియన్ గల్ఫ్ పరిధిలో ఉన్న ఏడు దేశాల్లోని అమెరికా సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ వేసింది. ఈ దాడులకు గిడ్డంగులు, ఆపరేషన్ కమాండ్ సెంటర్లు, విమాన హ్యాంగర్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటితోపాటు రన్‌వేలు, రాడార్ వ్యవస్థలు, వందల కోట్ల విలువ చేసే యుద్ధ విమానాలు కూడా డ్యామేజ్ అయ్యాయి.
సైనిక కదలికలు, నిఘా కార్యకలాపాలకు కీలకంగా ఉన్న ఇలాంటి మౌలిక వసతులపై ఇరాన్ దాడులు.. అమెరికాకు పెద్ద దెబ్బ అని పలువురు అధికారులు నివేదికలో వెల్లడించారు. ఇరాన్‌కు చెందిన పాత తరహా ఎఫ్5 యుద్ధ విమానం కూడా అత్యంత శక్తివంతమైన అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దాటి దాడి చేసినట్లు రిపోర్టు పేర్కొంది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది.
- వారంరోజుల్లో 11 వందల కోట్లు మటాష్
ఇరాన్ దాడుల వల్ల జరిగిన పూర్తి నష్టంపై అమెరికా రక్షణ శాఖ ఇంకా వివరణ ఇవ్వలేదు. పశ్చిమాసియా ప్రాంత సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ఈ నివేదికపై స్పందించేందుకు నిరాకరించింది. యుద్ధం కారణంగా అమెరికాకు జరుగుతున్న నష్టం విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంపై కొందరు రిపబ్లికన్ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొన్నివారాలుగా వివరాలు అడుగుతున్నా.. సమాచారం ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో అమెరికా డిఫెన్స్ శాఖ ప్రభుత్వాన్ని రికార్డు స్థాయి బడ్జెట్ కోరడంకూడా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌పై యుద్ధం కోసం రూ.17 లక్షల కోట్లకుపైగా కోరినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైన తొలివారంలోనే అమెరికా సైనిక కార్యకలాపాలకు 1,100 కోట్లకు కు పైగా ఖర్చు చేసినట్లు గతంలో వచ్చిన నివేదికలు వెల్లడించాయి. కాగా, 2026 సంవత్సరానికిగాను 838.5 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.

