హర్మూజ్ దిగ్బంధనం ప్రారంభించిన అమెరికా : గల్ప్ పోర్టులు నాశనం చేస్తామన్న ఇరాన్

హర్మూజ్ దిగ్బంధనం ప్రారంభించిన అమెరికా : గల్ప్ పోర్టులు నాశనం చేస్తామన్న ఇరాన్

యుద్ధం మళ్లీ మొదలైనట్లే.. చెప్పినట్టే అమెరికా హర్మూజ్ జల సంధిని దిగ్బంధించటానికి రంగంలోకి దిగింది. హర్మూజ్ జల సంధి ముందూ వెనకా తన యుద్ధ నౌకలను మోహరిస్తుంది అమెరికా. ఇరాన్ టైం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇది ప్రారంభం అయ్యింది. 

హర్మూజ్ జల సంధి నుంచి ఇరాన్ నౌకలను, ఇరాన్ దేశానికి పన్ను కట్టి వెళ్లే నౌకలను అడ్డుకుంటామని అమెరికా నేవీ ప్రకటించింది. గల్ఫ్ ఆఫ్ ఒమెన్, అరేబియా గల్ఫ్, ఇరాన్ పోర్టులతో సహా.. ఇరాన్ నౌకలు పోర్టులకు ప్రవేశించే అన్ని మార్గాలను మూసి వేయటానికి అమెరికా యుద్ధ నౌకలు మోహరిస్తున్నాయి. హర్మూజ్ జల సంధి మొత్తాన్న దిగ్బంధించి ఇరాన్ దేశంలోని ఓడరేవులకు వచ్చే నౌకలను.. అదే విధంగా ఇరాన్ దేశం నుంచి బయటకు వెళ్లే  నౌకలను అడ్డుకుంటామని.. ఆదేశాలను ధిక్కరిస్తే ఆయా నౌకలను పేల్చేస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ వార్నింగ్ ఇచ్చింది. 

అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో హర్మూజ్ జల సంధి దిగ్బంధన ప్రారంభం కావటంతో.. ఇరాన్ ఆర్మీకి చెందిన IRGC కమాండర్ స్పందించారు. 

హర్మూజ్ జల సంధిని అమెరికా దిగ్బంధిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని IRGC అధికార ప్రతినిధి వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లోని ఏ ఒక్క పోర్టు సురక్షితంగా ఉండదని.. ఇరాన్ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పర్షియల్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ లోని ఓ ఒక్క పోర్టును వదలకుండా టార్గెట్ చేస్తామని.. వాటిని నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారాయన. ఇప్పటికే హర్మూజ్ జల సంధిలోకి వచ్చిన అమెరికా యుద్ధ నౌకకు వార్నింగ్ ఇచ్చి.. వెనక్కి పంపించామని.. పదే పదే మా జలాల్లోకి వచ్చి.. నిబంధనలకు ఉల్లంఘిస్తే అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారాయన. 

ఇప్పటి వరకు హర్మూజ్ జల సంధి నుంచి తరచుగా.. అప్పుడప్పుడు కొన్ని నౌకలు ఆయా దేశాలకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఓ వైపు అమెరికా దిగ్బంధనం.. మరో వైపు ఇరాన్ చుట్టుముట్టటంతో ఏ ఒక్క నౌక కూడా ముందుకు కదలటానికి భయపడుతుంది. గతంలో ఇరాన్ దేశానికి మాత్రమే టార్గెట్ అయ్యాం.. ఇప్పుడు అమెరికా దాడులకు కూడా భయపడాల్సి వస్తుంది అంటూ నౌకల యజమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధి చుట్టూ ఉన్న నౌకలు.. ఎక్కడికక్కడే నిలిచిపోయాయని.. గతంలో ఇరాన్ అనుకూల దేశాలకు వెళుతున్న నౌకలు సైతం ఇప్పుడు ఆగిపోయాయి అంటున్నారు నౌకల యజమానులు. 

చర్చల విఫలం తర్వాత గల్ఫ్ దేశాల నుంచి ఒక్క ఆయిల్ నౌక కూడా బయలుదేరలేదని.. సంక్షోభం మరింత ముదిరింది అంటున్నారు ఆయా నౌకల యజమానులు. 11వ తేదీన కేవలం రెండు చైనా ఆయిల్ నౌకలు మాత్రమే హర్మూజ్ జల సంధి దాటాయని.. అమెరికా ప్రకటన తర్వాత చైనా నౌకలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే చైనా, ఇండియాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంతర్జాతీయ ఆయిల్ నిపుణులు అంటున్నారు.