వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో ఇరాన్ ఆమెకు అభినందనలు తెలిపింది. అలాగే, విమర్శలూ చేసింది. ‘మీరు మీ బిడ్డను ముద్దాడేటప్పుడు.. ఇరాన్ లోని స్కూల్‌పై ట్రంప్ చేసిన దాడిలో బిడ్డలను కోల్పోయిన ఆ తల్లుల గురించి ఒక్కసారి ఆలోచించండి’ అంటూ కామెంట్ చేసింది.
(వైట్ హౌస్) ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మే 1న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతూనే, ఇరాన్ ఒక విమర్శనాత్మకమైన సందేశాన్ని పంపింది. కరోలిన్ లెవిట్ తన కుమార్తె వివియానా పుట్టిన వార్తను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘‘మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి. దేవుడు గొప్పవాడు’’ అంటూ ఆమె భావోద్వేగంగా పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్‌పై ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ‘‘మీకు అభినందనలు. పిల్లలు ఎంతో అమాయకులు.. ప్రేమించదగ్గవారు.
కానీ, మీ బాస్ (ట్రంప్) ఆదేశాలతో ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలో చనిపోయిన ఆ 168 మంది కూడా పిల్లలే. ఆ దాడిని మీరు సమర్థించారు. ఇప్పుడు మీరు మీ బిడ్డను ముద్దాడేటప్పుడు.. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లుల గురించి ఒక్కసారి ఆలోచించండి” అని కౌంటర్ ఇచ్చింది.
కాగా.. ప్రస్తుతం తన రెండో బిడ్డ పుట్టిన సంతోషంలో ఉన్న లెవిట్.. ఇరాన్ చేసిన ఈ వివాదాస్పద, ఘాటు విమర్శలపై ఇంకా స్పందించలేదు. ఒకవైపు అభినందనలు తెలుపుతూనే, గతాన్ని గుర్తు చేస్తూ ఇరాన్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
