న్యూఢిల్లీ: యుద్ధ సంక్షోభంలో ఉన్న ఇరాన్ ప్రజల పట్ల భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటోంది. సోమవారం రాత్రి 20 టన్నుల అత్యవసర వైద్య సామగ్రిని పంపింది. ఇప్పటికే రెండు విడతల్లో 45 టన్నుల మందులను భారత్ విజయవంతంగా ఇరాన్‌కు చేరవేయగా.. తాజా 20 టన్నుల సరఫరాతో కలిపి మొత్తం మానవతా సాయం 65 టన్నులకు చేరుకుంది. ఢిల్లీ నుంచి 'మహాన్ ఎయిర్'కు చెందిన ప్రత్యేక విమానంలో నేరుగా ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయానికి మెడికల్ సప్లైస్ తరలించారు.
ఈ వైద్య సరఫరాల సేకరణలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నేరుగా పంపినవి మాత్రమే కాకుండా.. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం మన పౌరుల నుంచి సేకరించిన స్వచ్ఛంద విరాళాలతో కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్‌లోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ మాట్లాడుతూ.. "ప్రస్తుత కష్టకాలంలో ఇరాన్ ప్రభుత్వం, ప్రజల పట్ల భారత్ చూపుతున్న సానుభూతి, సంఘీభావానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
భారతీయ ప్రజల నమ్మకమైన భాగస్వామ్యానికి, దయకు కష్టకాలంలో వారు అందించిన స్వచ్ఛంద విరాళాలే నిదర్శనం. మెడిసిన్ల రవాణా ప్రక్రియను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన మోదీ ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

