అమెరికా గర్వకారణంగా భావించే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 'ఎఫ్-35 లైట్నింగ్ II' స్టెల్త్ యుద్ధ విమానంపై ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ రంగంలో పెను సంచలనంగా మారింది. రాడార్లకు చిక్కకుండా శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే ఈ ఐదవ తరం యుద్ధ విమానాన్ని ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థతో ఢీకొట్టడం అమెరికాకు కోలుకోలేని దెబ్బగా మారింది. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఈ ఉద్రిక్తతల్లో ఒక అమెరికన్ ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ విజయవంతంగా లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. తక్కువ రిసోర్సెస్ తో ఇరాన్ ఇంత విజయవంతంగా దాడి చేయటం చూసిన యుద్ధ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ భూభాగంపై పోరాట మిషన్‌లో ఉన్న ఈ అత్యాధునిక విమానం అకస్మాత్తుగా ఇబ్బందుల్లో పడిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు జరిపిన దాడిలో విమానం దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మిడిల్ ఈస్ట్ లోని ఒక అమెరికన్ ఎయిర్ బేస్‌లో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారని చెప్పారు. పైలట్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, వంద మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.930 కోట్లు విలువైన ఈ యుద్ధ విమానం దెబ్బతినడం అమెరికా రక్షణ వ్యూహాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఈ ఘటన అమెరికాకు ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను తాము పూర్తిగా నాశనం చేశామని, తామే యుద్ధంలో గెలుస్తున్నామని ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మెుత్తం రివర్స్ అవుతోంది. ఇరాన్ ఏకంగా రాడార్లకు కూడా చిక్కని ఒక ఎఫ్-35 విమానాన్ని తాకగలిగింది అంటే.. టెహ్రాన్ వద్ద ఇంకా శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని స్పష్టమవుతోంది. రాడార్లను ఏమార్చి, శత్రు స్థావరాల అంచుల్లోకి వెళ్లి దాడి చేసే సామర్థ్యం ఉన్న ఎఫ్-35ను ఇరాన్ ఎలా గుర్తించిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఫిబ్రవరి 28 నుంచి సాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 13 మంది అమెరికన్ సైనికులు మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక యుద్ధ విమానంపై దాడి జరగడం యుద్ధ పరిణామాలను మార్చేలా ఉంది. లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన ఈ ఎఫ్-35 విమానాలను కేవలం అమెరికానే కాకుండా ఇజ్రాయెల్ వంటి మరో 19 దేశాలు వాడుతున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ విమానాలను కూల్చగలిగే సాంకేతికతను కలిగి ఉంటే.. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా మిత్రదేశాల గగనతల భద్రతకు పెను సవాలుగా మారనుంది. ప్రస్తుతం ఈ విమానం ఎలా దెబ్బతిన్నదనే అంశంపై అమెరికా ఉన్నత స్థాయి దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి ప్రస్తుతం.
