ఇంగిల్‌వుడ్: రాజకీయ ఉద్రిక్తతల నడుమ బరిలోకి దిగిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు.. వరల్డ్ కప్‌లో ఆకట్టుకుంది. గ్రూప్–జిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 2–2తో డ్రా చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఇరాన్ ప్లేయర్లు రెండుసార్లు వెనకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని డ్రా వైపు తీసుకెళ్లారు.
ఇరాన్ తరఫున రామిన్ రెజాయ్ (32వ ని), మొహమ్మద్ మొహెబ్బి (64వ ని) గోల్స్ చేయగా, ఎలిజా జెస్ట్ (7, 54వ ని) కివీస్‌కు డబుల్ గోల్స్ అందించాడు. స్టార్టింగ్‌లోనే కివీస్ కెప్టెన్ క్రిస్ వుడ్ అందించిన పాస్‌ను ఎలిజా గోల్‌గా మలిచి 1–0 ఆధిక్యంలో నిలిపాడు. ఇక్కడి నుంచి ఇరాన్ ఎదురుదాడులకు దిగి స్కోరును సమం చేసింది. సెకండాఫ్‌లో ఇరాన్ మళ్లీ తడబడింది. డిఫెన్స్ పటిష్టం లేకపోవడంతో ఎలిజా కివీస్‌కు రెండో గోల్ అందించాడు.
దాంతో ఒత్తిడిలో పడిన ఇరాన్ ప్లేయర్లు అటాకింగ్ గేమ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రామిన్ రెజాయ్ అందించిన లాంగ్ పాస్‌ను మొహెబ్బి హెడర్‌గా మలచడంతో స్కోరు 2–2తో సమమైంది. ఆ తర్వాత ఇరు జట్లకు గోల్స్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ సఫలం కాలేదు. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఇరాన్ లీగ్ దశను దాటలేదు. మరోవైపు 2010 తర్వాత మొదటిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన న్యూజిలాండ్, బలమైన ఇరాన్‌ను నిలువరించి మంచి ఫలితాన్ని సాధించింది.
