ఆస్పత్రి శిథిలాల నుంచి మొజ్తబా ఖమేనీని వెలికితీశారు.. ఇరాన్ నేతపై సంచలన ప్రకటన!

ఆస్పత్రి శిథిలాల నుంచి మొజ్తబా ఖమేనీని వెలికితీశారు.. ఇరాన్ నేతపై సంచలన ప్రకటన!
  • అమెరికా తొలి దాడిలోనే తీవ్ర గాయాలు.. ట్రీట్‌‌‌‌మెంట్ పొందుతున్న ఆస్పత్రిపైనా దాడి 
  • ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌‌‌‌పర్ట్స్ సభ్యుడు మొహ్సేన్ హేదరీ వెల్లడి 

 న్యూయార్క్: ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌‌‌‌పర్ట్స్ సభ్యుడు మొహ్షెన్ హేదరీ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మొజ్తబాను ఓ ఆస్పత్రికి తరలించి ట్రీట్‌‌‌‌మెంట్ చేస్తుండగా.. ఆ ఆస్పత్రి పైనా అమెరికా దాడులు చేసిందని తెలిపారు. ఆస్పత్రి శిథిలాల నుంచి మొజ్తబాను వెలికి తీశారని, ఆ తర్వాత రహస్య ప్రాంతానికి తరలించారని పేర్కొన్నారు.

గురువారం ఖతార్ టెలివిజన్ నెట్‌‌‌‌వర్క్ ‘అల్ అరబీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహ్సేన్ హేదరి ఈ విషయాన్ని బయటపెట్టారని ‘న్యూయార్క్ పోస్ట్’ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. ఆస్పత్రులపై దాడి తర్వాతే 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని, అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదని తెలిపింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఇరాన్ స్టేట్ టెలివిజన్‌‌‌‌లో ప్రకటన ప్రసారమయ్యే వరకు తనను సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌గా ఎంపిక చేసినట్టు మొజ్తబాకు కూడా తెలియదని హేదరి తెలిపారు.

ఇరాన్ సుప్రీం లీడర్‌‌‌‌ను ఎన్నుకునే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌‌‌‌పర్ట్స్ సమావేశమయ్యే ఖోమ్ సెక్రటేరియెట్‌‌‌‌పైనా బాంబు దాడి జరగగా..8 మంది చనిపోయారు. కొత్త సుప్రీం లీడర్ ఎంపికకు సంబంధించిన రిపోర్టులు, సిఫార్సులు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత అసెంబ్లీ సభ్యులు ఎంపిక ప్రక్రియ కోసం ఒక రహస్య గదిలోకి వెళ్లడానికి ముందు కాగితాలపై తమ ఓట్లను రాశారని హేదరి తెలిపారు. మొజ్తబా పేరును సూచించిన మొదటి సభ్యుడిని తానేనని ఆయన గుర్తుచేసుకున్నారు.  

ఈ సమావేశంలో 59 ఓట్లకుగాను మొజ్తబాకు 50 ఓట్లు వచ్చాయని, 8 మంది సభ్యులు అయతొల్లా అలీరెజా అరాఫీకి ఓటు వేశారుని, ఒక సభ్యుడు ఓటింగ్‌‌‌‌కు దూరంగా ఉన్నారని హేదరీ వివరించారు.