వైరల్ కోసం కంటెంట్ సర్క్యూలేట్ చేయొద్దు.. లోకల్ కంటెంట్‌కు భవిష్యత్‌లో మరింత ఆదరణ: మంత్రి వివేక్

 వైరల్ కోసం కంటెంట్  సర్క్యూలేట్  చేయొద్దు.. లోకల్ కంటెంట్‌కు భవిష్యత్‌లో మరింత ఆదరణ: మంత్రి వివేక్

హైదరాబాద్: v6 న్యూస్, వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ ను కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి  ప్రారంభించారు. మీడియా రంగ భవిష్యత్, మారుతున్న సాంకేతికత, డిజిటల్ మీడియా ట్రెండ్స్‌పై ఈ సమ్మిట్‌లో కీలక చర్చలు జరిగాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఓటీటీ, సోషల్ మీడియా వంటి కొత్త మాధ్యమాలు మీడియా రంగంపై చూపుతున్న ప్రభావం, డిజిటల్ యుగంలో మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రముఖులు చర్చించారు. అడ్వర్టైజింగ్, టెక్నాలజీ, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సమ్మిట్‌కు హాజరయ్యారు.
  
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎక్కువ మంది న్యూస్ పేపర్లు చదివేవారని, ఆ తర్వాత టెలివిజన్ వార్తలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీడియా కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, తెలంగాణ నుంచి కొత్త మీడియా సంస్థలు రావడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చిందని మంత్రి వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో లోకల్ కంటెంట్‌కు మరింత ఆదరణ లభించే అవకాశం ఉందని అన్నారు.

ప్రస్తుతం మీడియా రంగం సోషల్ మీడియా నుంచి సవాళ్లు ఎదుర్కొంటోందని మంత్రి పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీడియా ఒకవైపు మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు ఉన్నాయని, మీడియా సంస్థలు బ్యాలెన్స్ పాటించాలని సూచించారు. మంచి కథనాలు అందిస్తే ప్రజల్లో ఆదరణ లభిస్తుందని అన్నారు. బాధ్యతాయుతమైన కంటెంట్‌కు మీడియా సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేవలం వైరల్ కోసం కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడం సరైన విధానం కాదన్నారు.

 ప్రస్తుతం డాక్టర్లు సైతం సోషల్ మీడియాలో అందుబాటులోకి వస్తున్నారని అన్నారు. తాను కూడా సమాచారం తెలుసుకోవడానికి ChatGPTను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.AI, సోషల్ మీడియా, ఓటీటీ వంటి కొత్త ప్లాట్‌ఫామ్‌లతో మీడియా రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన, విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన కంటెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.