లవ్లీ యూనివర్సిటీలో టెన్షన్..వర్సిటీ స్టూడెంట్ పై అత్యాచార వదంతులు

లవ్లీ యూనివర్సిటీలో టెన్షన్..వర్సిటీ స్టూడెంట్ పై అత్యాచార వదంతులు
  • క్యాంపస్‌‌‌‌లో ఆందోళన చేపట్టిన వేలాది మంది స్టూడెంట్లు
  • అందులో నిజంలేదన్న వర్సిటీ రిజిస్ట్రార్ 

జలంధర్‌‌‌‌‌‌‌‌: పంజాబ్‌‌‌‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌‌‌‌పీయూ) క్యాంపస్‌‌‌‌లో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. వర్సిటీలో ఒక విద్యార్థినిపై బయటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సోషల్ మీడియాలో వదంతులు వైరల్ అయ్యాయి. దీంతో వేలాదిమంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామున ఉమెన్స్ హాస్టల్ సమీపంలో ప్రారంభమైన ఈ నిరసనలు క్రమంగా ఉద్రిక్తతకు దారితీశాయి. 

ఆందోళనకారులు క్యాంపస్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌కు చెందిన మిగ్–-23 విమానంపైకి ఎక్కగా, మరో 10 మంది విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేసిన డూప్లికేట్ మిలిటరీ ట్యాంక్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. క్యాంపస్‌‌‌‌లోని కిటికీ అద్దాలు ధ్వంసం చేయడం, దుకాణాలను లూటీ చేయడం, భవనాలకు నిప్పు అంటించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మరికొందరు జలంధర్ ఫగ్వారా నేషనల్ హైవేపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. 

దీంతో ట్రాఫిక్ కు భారీ అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కాగా, సెప్టెంబర్ 24న వర్సిటీ హాస్టల్‌‌‌‌లో ఉంటున్న ఓ విద్యార్థినిపై నిర్మాణ రంగంలో పనిచేసే వ్యక్తి లేదా ప్లంబర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపించారు. 

సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇవన్నీ కేవలం వదంతులేనని తేలిందని స్పష్టం చేశారు. బాధిత విద్యార్థిని నుంచి వాంగ్మూలం సేకరించి ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడి ఆచూకీ ఇంకా తేలకపోవడంతో అజ్ఞాత వ్యక్తిపై ప్రాథమికంగా కేసు నమోదు చేశామని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు. ఈ ఘటనను దర్యాప్తు చేయడానికి ఫగ్వారా ఎస్పీ మేజర్ సింగ్ నేతృత్వంలో సిట్‌‌‌‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఎల్‌‌‌‌పీయూ రిజిస్ట్రార్ మోనికా గులాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.