న్యూఢిల్లీ: రోడ్డు నాణ్యత తనిఖీలకు వచ్చిన ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ తనను వీడియో తీస్తున్న ఓ యువకుడిపై చేయిచేసుకున్నాడు. ఆదివారం తిలక్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిలక్ నగర్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఘటనా స్థలంలో కొత్తగా వేసిన రోడ్డును చేతితో పెకిలించి చూపిస్తూ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందంటూ మంత్రిని నిలదీశారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు ఈ తతంతగాన్నంతా తన ఫోన్ లో రికార్డు చేస్తున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన పర్వేశ్ వర్మ.. ఆ యువకుడిపై చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో రోడ్డు నాణ్యతపై ప్రజలు, ఎమ్మెల్యే ప్రశ్నించడంతో మంత్రి సహనం కోల్పోయి దాడికి దిగారని ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
సోమవారం తాను స్వయంగా తిలక్ నగర్‌కు వెళ్లి ఆ రోడ్డును పరిశీలిస్తానని ‘ఎక్స్’లో ప్రకటించారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడం దారుణమని, వెంటనే మంత్రిని అరెస్టు చేయాలని అతిశీ డిమాండ్ చేశారు.
నా ఫ్యామిలీని తిట్టారు.. : మంత్రి పర్వేశ్ వర్మ
ఆప్ నేతల ఆరోపణలను మంత్రి పర్వేశ్ వర్మ తోసిపుచ్చారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆప్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ వద్ద కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. రోడ్డు పనులపై ఫిర్యాదు రావడంతో పరిశీలనకు వెళ్తూ ఎమ్మెల్యేను ఆహ్వానించానని చెప్పారు. అయితే, ఎమ్మెల్యే తన అనుచరులను అక్కడికి పిలిపించి, తనను, తన కుటుంబాన్ని బూతులు తిట్టించారని, ఆ పరిస్థితుల్లో ఏ సామాన్యుడైనా స్పందించే రీతిలోనే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
