జ్ఞానేష్ కుమార్ బీజేపీ కోసం రిక్రూట్ చేసేవారు: రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

జ్ఞానేష్ కుమార్ బీజేపీ కోసం రిక్రూట్ చేసేవారు: రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

మోదీ, అమిత్ షాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఫిక్సింగ్ అంటూ కామెంట్

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ గతంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సమయంలో బీజేపీ కోసం నాయకులను రిక్రూట్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి జీజీ థామస్ చేసిన ప్రకటనను ఆధారం చేసుకుని రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీజీ థామస్ ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ 2016లో తాను పదవీ విరమణ చేసే సమయంలో జ్ఞానేష్ కుమార్ తనకు బీజేపీ టికెట్‌‌‌‌‌‌‌‌పై పోటీ చేయాలని ప్రతిపాదించారని వెల్లడించారు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా, ఆ తర్వాత మంత్రి కావాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో జ్ఞానేష్ ఐఏఎస్ అధికారిగా కొనసాగుతుండటం గమనార్హం. ఈ ఉదంతంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. "మొదట్లో జ్ఞానేష్ కుమార్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఐఏఎస్ అధికారిగా ఉంటూ బీజేపీ కోసం రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లు చేయడానికి సహకరించారు. 

ఆ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి ఆయనే అంపైర్‌‌‌‌‌‌‌‌గా కూర్చునేలా చేసి, దేశ ఎన్నికలను మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఫిక్సింగ్ చేసే బాధ్యతను అప్పగించారు" అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.