చెన్నై: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తన వివాదాస్పద నిర్ణయంపై వెనక్కి తగ్గింది. పబ్లిక్ (శాంతిభద్రతలు) శాఖను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో రద్దు చేసింది. సెప్టెంబర్ 21న జారీ చేసిన జీవో నెం. 57ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పోలీసు కాల్పులు, కస్టడీ మరణాలు, వేధింపులు వంటి సున్నితమైన అంశాల వివరాలు ప్రజలకు అందకుండా చేయడానికే ఈ మినహాయింపు తెచ్చారంటూ విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది తమిళనాడును 'పోలీస్ స్టేట్'గా మారుస్తుందని సీపీఎం ఎంపీ వెంకటేశన్ మండిపడ్డారు. కాగా, కేవలం కొన్ని సామాజిక ఘర్షణలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నిరోధించాలని భావించామని మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు.
