టెహ్రాన్: అమెరికాను కూడా తాకే సామర్థ్యం ఉన్న మిసైల్స్‌ను ఇరాన్ తయారుచేస్తున్నదంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలు పెద్ద అబద్ధమని పేర్కొన్నది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ‘ఎక్స్’ వేదికగా అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. తమ దేశ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల సామర్థ్యం,ఇటీవలి అంతర్గత అశాంతిలో చోటుచేసుకున్న మరణాల సంఖ్యపై అమెరికా చేస్తున్న వాదనలు పూర్తిగా నిరాధారమని ఆ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బాకేయ్ వెల్లడించారు.
అమెరికా ఆరోపణలు పదే పదే చెబుతున్న పెద్ద అబద్ధాలు మాత్రమేనని స్పష్టం చేశారు. తాను ఏ నిర్దిష్ట వాదనలకు సమాధానం ఇస్తున్నారో బాకేయ్ స్పష్టం చేయనప్పటికీ.. అమెరికా గడ్డను చేరుకోగల క్షిపణుల కోసం ఇరాన్ ప్రయత్నిస్తున్నదని ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ఈ స్పందన రావడం గమనార్హం. ఈ నెలలో అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికాపై దాడి చేసే సామర్థ్యం ప్రస్తుతం ఇరాన్‌కు లేదని, అయితే యూఎస్ గనుక దాడికి దిగితే మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై తాము దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ను ఎప్పటికీ అణు ఆయుధాన్ని తయారు చేయనివ్వబోమని పేర్కొన్నారు. ఇరాన్ నాయకులు మళ్లీ అణ్వస్త్రాలు తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. తమకు అణ్వాయుధాల తయారీ ఉద్దేశం లేదని, కేవలం శాంతియుత అవసరాల కోసమే అణు సాంకేతికతను ఉపయోగిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా, అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకునేందుకు ఒమన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే రెండు రౌండ్ల చర్చలు జరిగాయి. గురువారం మూడో రౌండ్ చర్చలు జరగనున్నాయి.
