- దేశ వృద్ధి రేటు 3.9 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందన్న వరల్డ్ బ్యాంక్
ఢాకా: ఇరాన్ యుద్ధం వల్ల బంగ్లాదేశ్ లో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం కలగడం, ఖర్చులు పెరిగి, ఆదాయం పడిపోవడమే ఇందుకు కారణం. దేశ ఆర్థిక వెన్నెముకైన వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో..
ఢాకాకు చెందిన తారికుల్ ఇస్లాం అనే బైక్ రైడర్ అక్కడి పరిస్థితికి ఉదాహరణ. గతంలో దుస్తుల వ్యాపారంలో నష్టపోయి బైక్ రైడింగ్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన ఇప్పుడు పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. ‘ఒకరోజు ఇంధనం కోసం క్యూలో ఉంటే, మరో రెండు రోజులు మాత్రమే బైక్ నడపగలుగుతున్నాను. దీనివల్ల ఆదాయం సగానికి పడిపోయింది. ఇలాగే కొనసాగితే పట్నం వదిలి గ్రామానికి వెళ్లిపోవాల్సిందే’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం ఆ దేశంపై పెనుభారాన్ని మోపుతోంది. కేవలం ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికానికి సంబంధించి ఎల్‌ఎన్‌జీ సబ్సిడీల కోసం ప్రభుత్వం అదనంగా 1.07 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ వృద్ధి రేటు 3.9 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది.
తమను బలిచేయొద్దని వేడుకోలు
వస్త్ర పరిశ్రమలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు తమ ఉద్యోగాల గురించి భయపడుతున్నారు. ‘మేము ఏ పాపం చేయని సామాన్యులం. ప్రపంచ యుద్ధ రాజకీయాలకు మమ్మల్ని బలి చేయకండి’ అని కోరుతున్నారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం తన పొరుగు దేశమైన భారత్ నుంచి ఇంధన సహాయాన్ని ఆశిస్తోంది. యుద్ధం త్వరగా ముగిస్తేనే ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడతాయని నిపుణులు అంటున్నారు.
ఎరువుల ఫ్యాక్టరీలు మూసివేత
విద్యుత్ ఉత్పత్తికి గ్యాస్‌ను మళ్లించేందుకు ప్రభుత్వం ఎరువుల కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేసింది. షాపింగ్ మాల్స్ సమయాన్ని తగ్గించి, ఇంధన రేషనింగ్‌ను అమలు చేస్తోంది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారు అయిన బంగ్లాదేశ్‌కు ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది.
ఉత్పత్తి ఖర్చులు 35% నుంచి 40% వరకు పెరిగాయి. ఎగుమతులు 5% నుంచి 13% వరకు తగ్గుముఖం పట్టాయి. విద్యుత్ కోతల వల్ల జనరేటర్ల వాడకం పెరిగి తయారీ వ్యయం భారమైంది. దీనివల్ల భారత్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలకు ఆర్డర్లు మళ్లే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
