కొవిడ్తో మ్యాచ్ ఆడిన జార్జ్ డాక్రెల్

కొవిడ్తో మ్యాచ్ ఆడిన జార్జ్ డాక్రెల్

కరోనా పాజిటివ్ వచ్చినా ...టీ20 వరల్డ్ కప్ ఆడాడు ఓ క్రికెటర్.  కరోనా సోకినట్లు తేలినా.. శ్రీలంకతో జరిగిన  మ్యాచ్ లో ఐర్లాండ్ క్రికెటర్ జార్జ్ డాక్రెల్ పాల్గొన్నాడు. దీంతో కొవిడ్ 19 ఉన్నప్పటికీ..వరల్డ్ కప్ ఆడిన తొలి క్రికెటర్ గా జార్జ్ డాక్రెల్ చరిత్ర సృష్టించాడు.

స్వల్ప లక్షణాలే...
శ్రీలంకతో సూపర్ 12 రౌండ్ మ్యాచ్ కు ముందు జార్జ్ డాక్రెల్‌ కరోనాకు గురయ్యాడు. అయితే మారిన ఐసీసీ రూల్స్‌ని అమలు చేస్తూ  ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అతనికి తుది జట్టులో చోటు కల్పించింది. ఆ తర్వాత జార్జ్ డాక్రెల్‌లో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండడంతో మిగిలిన ప్లేయర్లకు ఈ వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్ లో డాక్రెల్..16 బంతుల్లో 14 పరుగులు చేశాడు.  కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత కూడా క్రికెట్ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా జార్జ్ డాక్రెల్ రికార్డు క్రియేట్ చేశాడు.

రూల్స్ మార్చిన ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ రూల్స్ మార్చింది. ఒకవేళ మ్యాచ్ ఆడాల్సిన జట్టులోనే ఆటగాడికి కరోనా వైరస్ వచ్చినప్పటికీ మ్యాచ్లో పాల్గొనేందుకు  అనుమతి ఇచ్చింది.  టోర్నీ సమయంలో ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్ తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది.. ఒకవేళ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిన ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఆటగాడు ఆరోగ్య పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడాలో లేదో నిర్ణయించుకోవాలని సూచించింది. 


ఇది కొత్తేమీ కాదు..
కొవిడ్ సోకిన ఆటగాళ్లకు మ్యాచ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం ఐసీసీకి ఇదేమీ కొత్త కాదు.  కామన్వెల్త్ గేమ్స్లోనే ఐసీసీ ఈ రూల్ను తీసుకొచ్చింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ కు కరోనా సోకింది. అయినా ఆమె  ఆడేందుకు ఐసీసీ అంగీకరించింది. మ్యాచ్ సమయంలో తహ్లియా మాస్క్‌ ధరించి జట్టుకు దూరంగా కూర్చుంది. ఆస్ట్రేలియా గెలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న తర్వాత ఆమె జట్టుతో సంబరాలు చేసుకుంది. 

బయోబబుల్తో ఇబ్బందులు..
కరోనా క్రీడా ప్రపంచాన్ని అతలాకుతులం చేసింది. కరోనా వైరస్ కారణంగా అన్ని రకాల ఆటలు నిలిచిపోయాయి. కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.  కొంతకాలం తర్వాత పరిస్థితి మెరుగుపడకపోవడంతో చివరికి కఠినమైన కరోనా నిబంధనల మధ్య అన్ని దేశాల బోర్డులు మ్యాచ్ లు నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఆటగాళ్లను  బయోబబుల్ అనే నిబంధనలను అమలు చేశాయి. దీనిలో భాగంగా ఆటగాళ్లను హోటల్లో ఉంచుతూ ..బయట ప్రపంచానికి దూరంగా  మ్యాచ్లు ఆడిస్తూ వచ్చాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరిస్థితులు చక్కబడ్డాయి. ఆటగాళ్లు స్వేచ్ఛగా మ్యాచులు ఆడుతున్నారు.