డిజిటల్ విప్లవానికి కేరాఫ్ అడ్రస్ భారత్ అని.. దేశంలోని మారుమూల పల్లెల్లో కూడా UPI చేరిందని గొప్పలు చెప్పుకుంటుంది మోడీ సర్కార్. కానీ.. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో అదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే చెల్లుతుందని చెబితే అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో ప్రతినిధులకు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన టెక్ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, పరిశోధకులు ఈ ఏఐ సదస్సులో పాల్గొంటున్నారు. డిజిటల్ ఇండియా మిషన్ కింద సాగుతున్న కార్యక్రమంలో భవిష్యత్తు సాంకేతికత గురించి మేధోమథనం జరుగుతోంది. అయితే భోజన కౌంటర్ల వద్దకు వెళ్లిన అతిథులకు మాత్రం షాక్ తగిలింది. అక్కడ ఫుడ్ వెండర్లు కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పారు. కార్డ్ పేమెంట్స్ లేవు, యూపీఐ పనిచేయదు.. కేవలం కరెన్సీ నోట్లు ఉంటేనే తిండి, నీళ్లు అనే పరిస్థితి తలెత్తింది. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న దేశంలో.. ఒక ప్రతిష్టాత్మక టెక్ సమ్మిట్‌లో ఈ పరిస్థితి రావడం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోందంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
Day 1 at the AI Summit:
— Yavanika Shah (@yavanikashah) February 16, 2026
We’re apparently building the future.
Meanwhile:
– No water.
– Traffic like it’s a festival + protest + wedding baraat combined.
– AQI doing live demo of “real world simulation.”
– Queues so long they need their own breakout session.
– Cash only food…
ఈ గందరగోళంపై ఎక్స్ వేదికగా నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఏఐ సమ్మిట్‌లో తిండి కావాలంటే జేబులో నోట్లు ఉండాలా? ఇదా మనం సాధించిన డిజిటల్ ప్రగతి? అంటూ ఒక యూజర్ ప్రశ్నించారు. ఇది బ్యాడ్ ఎగ్జిక్యూషన్‌కు మాస్టర్ క్లాస్ లాంటిదంటూ మరొకరు ఏర్పాట్లపై ఎద్దేవా చేశారు. కేవలం పేమెంట్లే కాదు.. కనీసం WiFi ఫెసిలిటీ కూడా సమ్మిట్ ప్రాంతంలో సరిగ్గా లేదని, క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యం వల్ల అక్కడికి వచ్చిన గెస్ట్స్ గంటల తరబడి క్యూలలో వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ఏఐ ఎక్స్‌పో, ప్యానెల్ చర్చలు, హ్యాకథాన్‌లు వంటి భారీ కార్యక్రమాలు ఉన్నాయి. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయ రంగాల్లో ఏఐ వినియోగంపై గొప్ప ఉపన్యాసాలు వినిపిస్తున్న వేళ.. కనీస సౌకర్యాలైన డిజిటల్ పేమెంట్లు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ ఏర్పాట్లలోని లోపాలను ఎత్తిచూపుతోంది. టెక్నాలజీ గురించి మాట్లాడే చోట టెక్నాలజీనే పక్కన పెట్టడం చూస్తుంటే.. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు మాత్రం కనిపించటం లేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
