పొదుపు మహిళల లోన్ల మంజూరులో బయటపడుతున్నఅక్రమాలు

పొదుపు మహిళల లోన్ల మంజూరులో బయటపడుతున్నఅక్రమాలు
  • బ్యాంకర్లు, వీవోఏల కుమ్మక్కు?
  • లక్షల ఫండ్స్ పక్కదారి
  • పట్టించుకోని ఆఫీసర్లు
  • నామమాత్రపు చర్యలతోనే సరి

మహబూబాబాద్, వెలుగు: గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా లోన్లు మంజూరు చేస్తోంది. చాలా మంది మహిళలు నిరక్షరాస్యులు కావడం, బ్యాంకు లావాదేవీలపై అవేర్ నెస్ లేకపోవడంతో డ్వాక్రా సంఘాల పరిధిలో పనిచేసే వీవోఏలు, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లు, మేనేజర్లు అంతా కుమ్మక్కై లోన్లు మంజూరులో అవకతవకలకు పాల్పడుతున్నారు. మహిళా సంఘాలు తీసుకున్న లోన్ చెల్లించినప్పటికీ.. పాత తీర్మానాలు, జిరాక్సు కాపీలతో ఆయా సంఘాలకు మళ్లీ లోన్లు మంజూరు చేస్తున్నారు. ఈ సంగతి మహిళలకు చెప్పకుండా నిధులన్నీ కాజేస్తూ.. అప్పు తీరలేదంటూ సంఘ సభ్యులతో డబ్బులు కట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రుణమాఫీ అయినా.. కాలేదంటూ బుకాయించి ఆ డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన డీఆర్​డీఏ ఆఫీసర్లు నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నారు. జిల్లాలోని కొత్తగూడ, మరిపెడ, తొర్రూరు మండలాల పరిధిలో ఇలాంటి తరహా అవినీతి బయటపడగా.. ఎంక్వైరీ చేస్తే మరిన్ని మండలాలు కూడా బయటపడనున్నాయి.
ఇటీవల పలు సంఘటనలు..
కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల నిధుల మంజూరులో అక్రమాలు బయటపడ్డాయి. లోన్ కావాలని ఇండియన్​ బ్యాంక్​లో మహిళలు అప్లై చేసుకోగా.. గతంలో తీసుకున్న అప్పులో ఇంకా రూ.లక్ష బాకీ ఉందని, బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. తాము లోన్ అంతా చెల్లించామని వారితో వాగ్వాదానికి దిగారు. గ్రామ వీవోఏతో పాటు పాత మేనేజర్ ఇద్దరూ కుమ్మక్కై ఫోర్జరీ తీర్మానాలతో డ్వాక్రా సంఘాల పేరు మీద రూ.9 లక్షల కొట్టేశారని తెలుసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు బ్యాంకు ముందు బైఠాయించి ధర్నా చేశారు.
మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామ పరిధిలో డ్వాక్రా మహిళా సంఘాల పొదుపు నిధులు స్వాహా చేశారని మహిళలంతా సీసీ, వీవోఏను జీపీ ఆఫీసులో నిర్బంధించారు. గ్రామ పరిధిలోని 17 మహిళా సంఘాల నుంచి సుమారు రూ.24లక్షలు కాజేశారని ఆరోపించారు. దీనిపై ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ సాయంతో పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు.
అవినీతి బయటపడ్డా.. చర్యలు శూన్యం
నిధుల గోల్ మాల్ నిజమని తేలినా సిబ్బందిపై  ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వీవోఏలను తొలగించినా రాజకీయ పలుకుబడితో మళ్లీ కొనసాగుతున్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు సస్పెండ్ చేస్తున్నా బ్యాంక్ మేనేజర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గతంలో తొర్రూరు మండలంలో రూ.61.98లక్షలు కాజేయగా.. ఆఫీసర్లు డబ్బులు రికవరీ చేశారు. అయినా వీవోఏలు తమ నాయకుల అండదండలతో డ్యూటీలో కొనసాగుతున్నారు. అమాయక మహిళలను ఆసరాగా చేసుకుని, అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. తాము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటే నకిలీ పేపర్లు సృష్టించి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..
డ్వాక్రా సంఘాల రుణాల మంజూరు, విడుదల క్రమంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. బ్యాంకు ఆఫీసర్లు, వీవోఏల అవినీతి రుజువైతే కేసులు పెట్టడంతో పాటుగా డబ్బులు రికవరీ చేస్తాం. ఏటా సంఘాల వారీగా ఆడిట్ నిర్వహిస్తాం. ఇక నుంచి ఫండ్స్ రిలీజ్​పై బ్యాంకర్ల నుంచి రిపోర్ట్స్ తీసుకుంటాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే డీఆర్ డీఏ ఆఫీసర్లకు కంప్లయింట్ చేయాలి. – సన్యాసయ్య, డీఆర్ డీఏ పీడీ, మహబూబాబాద్ జిల్లా