ఆయకట్టు లెక్క పక్కాగా ఉండాలి

ఆయకట్టు లెక్క పక్కాగా ఉండాలి
  • అన్ని ప్రాజెక్టుల సీఈలకు ఇరిగేషన్​శాఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సాగవుతున్న ఆయకట్టు వివరాలను కచ్చితమైన లెక్కలతో అందించాలని ప్రాజెక్టుల సీఈలను ఇరిగేషన్ శాఖ ఆదేశించింది.  కలెక్టర్లు ఇస్తున్న డేటాకు.. ఇరిగేషన్​అధికారులిస్తున్న వివరాలకు పొంతన ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతుల కోసం కేంద్రానికి వివరాలు సమర్పించే సమయంలోనూ ఆయకట్టు విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయని వివరించింది. 

అందువల్ల ఆయకట్టు లెక్కలను పక్కాగా తేల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ శుక్రవారం క్యాచ్‌మెంట్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(సీఏడీఏ) సీఈ రఘునాథ రావు నేతృత్వంలో సీఈలతో ఆయకట్టుపై సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టుల కింద ఆయకట్టు వివరాలు అందగా.. కృష్ణా ప్రాజెక్టుల కింద ఆయకట్టు వివరాలు ఇంకా ఇవ్వలేదు. దీంతో వీలైనంత త్వరగా ఆయకట్టు వివరాలను సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.