మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా కుట్రంటరా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మీ హయాంలో మేడిగడ్డ కుంగితే మా కుట్రంటరా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

  • గోబెల్స్​ కన్నా హీనంగా కేటీఆర్​ తయారైండు: మంత్రి ఉత్తమ్​
  • ఇద్దరు మంత్రులు కుట్ర చేసినట్టు ఆధారాలుంటే జ్యుడీషియల్​కమిషన్​కు ఇవ్వండి
  •  కేసీఆర్​ దిక్కుమాలిన డిజైన్లతోకాళేశ్వరం కట్టిండు
  • లక్ష కోట్ల స్కామ్​ అది..అందులో కేసీఆర్​ ఫ్యామిలీకి భాగం
  • వాళ్లు చెప్పినా చెప్పకపోయినా మేం పంటలకు నీళ్లిస్తం
  • రైతులకు కేసీఆర్​ ఫ్యామిలీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం పేరిట అత్యంత నాసిరకమైన ప్రాజెక్ట్​ను కేసీఆర్​ కట్టించారని, ఆయన హయాంలోనే ఆ ప్రాజెక్ట్​లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. ‘‘వారి తెలివి తక్కువ తనం, కాసుల కక్కుర్తి, దోపిడీ వల్లే బ్యారేజీ కుంగి తీవ్ర నష్టం వాటిల్లింది. వాళ్ల తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఎదుటివాళ్లపై బద్నాం మోపుతున్నరు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనుక కాంగ్రెస్​ కుట్ర ఉందంటూ కేటీఆర్​ మాట్లాడడం చాలా దారుణం. కేటీఆర్​ వ్యాఖ్యల్లో రాజకీయ దురుద్దేశం ఉంది. అధికారం పోయిందన్న అక్కసుతోనే ఇలాంటి సిల్లీ వ్యాఖ్యలు చేస్తున్నడు” అని ఫైర్​ అయ్యారు. ఆదివారం జలసౌధలో ఇరిగేషన్​ అధికారులతో మంత్రి ఉత్తమ్​ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ వాళ్ల దోపిడీతో బ్యారేజీ కుంగిపోతే కాంగ్రెస్​ కుట్రలు చేసిందనడం సిల్లీగా ఉందని అన్నారు. ‘‘ప్రాజెక్ట్​పై అన్నీ అబద్ధాలే చెప్తున్నరు. గోబెల్స్​ కన్నా హీనంగా కేటీఆర్​ తయారైండు. నాడు యుద్ధం సమయంలో జోసెఫ్​ గోబెల్స్​.. హిట్లర్​కు అన్నీ తప్పుడు నివేదికలే ఇచ్చి జర్మనీ నాశనం కావడానికి కారకుడైండు. ఇప్పుడు అంతకుమించి కేటీఆర్​ అబద్ధాలు ఆడుతున్నడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వెనక ఇద్దరు మంత్రుల కుట్ర ఉందని కేటీఆర్​ అంటున్నడు. అలాంటప్పుడు మీరు(బీఆర్​ఎస్​) అధికారంలో ఉన్నప్పుడే కదా అది కుంగిపోయింది. అప్పుడే ఎందుకు దర్యాప్తు చేయించలేదు. కాళేశ్వరంపై మీకు నిజంగా అనుమానాలుంటే, ఆధారాలుంటే.. జ్యుడీషియల్​ కమిషన్​ను కలిసి సమాచారం ఇవ్వొచ్చు” అని అన్నారు.‘‘జస్టిస్​ పినాకి చంద్రఘోష్​కు ఆధారాలను సమర్పించొచ్చు’’ అని ఉత్తమ్​ తేల్చిచెప్పారు. 

బ్యారేజీల్లో నీటిని స్టోర్​ చేస్తరా?ప్రపంచంలో ఎక్కడైనా సరే నీటిని స్టోర్  చేసుకోవాలంటే డ్యాములు కడతారని, బ్యారేజీలు కాదని మంత్రి ఉత్తమ్​ అన్నారు. బ్యారేజీలను కేవలం వాటర్​ను గైడ్​ చేయడానికే వాడుతారని, వాటిలో 3 టీఎంసీలకు మించి స్టోర్​ చెయ్యరని చెప్పారు. కానీ, మేడిగడ్డ బ్యారేజీలో 16 టీఎంసీల నీళ్లు స్టోర్​ చేసి కూలేదాకా తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును సదుద్దేశంతో కట్టలేదని.. అది లక్ష కోట్ల స్కామ్​ అని, అందులో కేసీఆర్​, ఆయన ఫ్యామిలీకి భాగం ఉందని ఆరోపించారు. బ్యారేజీలు ప్రారంభించిన కొన్నాళ్లకే సీకెంట్​ పైల్స్​ కొట్టుకుపోయాయని, ఫౌండేషన్​ సరిగ్గా లేదని విజిలెన్స్​ రిపోర్ట్​ ఇచ్చిందని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ‘‘అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలున్నాయని 2022లోనే కాంట్రాక్ట్​ సంస్థలకు నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం లేఖలు రాసింది.  బ్యారేజీల్లో లీకులున్నాయని ఎల్​ అండ్​ టీ సంస్థకు ఇరిగేషన్​ అధికారులు కూడా లేఖలు రాశారు. దిక్కుమాలిన డిజైన్లతో కట్టిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే దానిని కాంగ్రెస్​ పార్టీకి ఆపాదించడం విడ్డూరంగా ఉంది. డిజైన్లు బాగాలేవు.. ఆపరేషన్స్​ అండ్​ మెయింటనెన్స్​ సరిగ్గా చేయలేదు.. అని ఆన్​ రికార్డ్​లో ఉంది. బ్యారేజీ సైట్లలో కనీసం సాయిల్​ టెస్టులు కూడా చేయలేదు. అధికారులకు సరైన సమయం కూడా నాడు బీఆర్​ఎస్​ సర్కార్​ ఇవ్వలేదు” అని ఆయన పేర్కొన్నారు. 

వాళ్లు చెప్పినా చెప్పకపోయినా నీళ్లిస్తం

ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టించింది ఆనాటి కాంగ్రెస్​ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. ఆ ప్రాజెక్టును బీఆర్​ఎస్​ వాళ్లు కట్టలేదని అన్నారు. వాళ్లు చెప్పినా చెప్పకపోయినా ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేవాళ్లమని,  ప్రాజెక్ట్​ నిండడంతో ఇప్పటికే ఎత్తిపోతలను స్టార్ట్​ చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తమకెలాంటి రాజకీయ దురుద్దేశమూ లేదని, ఆ ప్రాజెక్టుతో రైతులకు ఎలా మేలు చేయొచ్చన్న దానిపై చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. దానిని ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎల్లంపల్లికి ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్​లోని మల్లన్నసాగర్​, కొండపోచమ్మసాగర్​ వంటి కాంపొనెంట్లన్నింటినీ ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ నేతల వల్లే కాళేశ్వరం కుంగి రైతులకు నష్టం వాటిల్లిందని,  రాష్ట్ర రైతులకు కేసీఆర్​ కుటుంబ సభ్యులు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. 

కేసీఆర్​కు ఏం దుర్బుద్ధి పుట్టిందో

16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో తుమ్మిడిహెట్టి వద్ద వైఎస్​ హయాంలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని మంత్రి ఉత్తమ్​గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లపాటు ఆ ప్రాజెక్టును కేసీఆర్​ సర్కార్​ కూడా కొనసాగించిందని, దానికి జాతీయ హోదా కోసం డిమాండ్​ కూడా చేసిందని చెప్పారు. కానీ, ఏం దుర్బుద్ధి పుట్టిందో ఏమోగానీ.. హఠాత్తుగా రీడిజైన్​ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్​ చేపట్టారని మండిపడ్డారు.  ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఆయకట్టు ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై అన్నీ అబద్ధాలే చెప్పారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ ఫీజిబుల్​ కాదని 2015లో రిటైర్డ్​ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్​ ఇచ్చినా దాచేశారు. బయటకు రానివ్వకుండా రికార్డుల నుంచీ తొలగించాలని చూశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అబద్ధాలు చెప్పారు. కానీ, 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా అక్కడ 168 టీఎంసీలున్నాయని సీడబ్ల్యూసీ రిపోర్ట్​ కూడా ఇచ్చింది’’ అని వివరించారు. 

ప్రజలను తాకట్టు పెట్టి దిక్కుమాలిన ప్రాజెక్టు కట్టిండు

రాష్ట్ర ప్రజలందరినీ తాకట్టు పెట్టి గత బీఆర్​ఎస్​ సర్కార్​ దిక్కుమాలిన డిజైన్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని మంత్రి ఉత్తమ్​ఫైర్​ అయ్యారు. ప్రజాప్రయోజనాలున్న ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ కింద రుణాలను తీసుకుంటారని.. కానీ, వాళ్లు మాత్రం అధిక వడ్డీలకు రుణాలు తెచ్చారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుని ఒకే ఒక్క లిఫ్టుతో ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో మూడు లిఫ్టుల ద్వారా ఎత్తిపోయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దానికి కరెంట్​ బిల్లే ఏడాదికి రూ.10 వేల కోట్లు అని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు ఇప్పటికే నీళ్లు ఇచ్చి ఉండేవాళ్లమని మంత్రి ఉత్తమ్​ వివరించారు.