మీ గుండెల్లో క్రికెట్ ఉందా? ప్రస్తుత విండీస్ టీమ్‌‌కు లారా ప్రశ్న

మీ గుండెల్లో క్రికెట్ ఉందా? ప్రస్తుత విండీస్ టీమ్‌‌కు లారా ప్రశ్న

ముంబై: మనసులో క్రికెట్‌‌ ఉంటే కష్టాల్లో ఉన్న వెస్టిండీస్‌‌ జట్టును ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏదో ఓ మార్గాన్ని వెతకొచ్చని లెజెండరీ బ్యాటర్‌‌ బ్రియాన్‌‌ లారా అన్నాడు. ప్రస్తుతం తమ జట్టు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తాత్కాలికమేనని స్పష్టం చేశాడు. ‘మీ గుండెల్లో క్రికెట్ ఉందా?  విండీస్ కోసం మీరు మనసు పెట్టి క్రికెట్‌‌ ఆడుతున్నారా? అని నేను రోస్టన్‌‌ చేజ్‌‌, ఇతర ప్లేయర్లను అడుగుతున్నా. 

విండీస్‌‌కు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నారా? ఇది నిజమైతే మీరు కచ్చితంగా ఏదో ఓ మార్గాన్ని కనుగొంటారు. 30, 40 ఏళ్ల క్రితం మాకు మెరుగైన సౌకర్యాలు లేవు. వివ్‌‌ రిచర్డ్స్‌‌ మెరుగైన ప్రాక్టీస్‌‌ పిచ్‌‌లపై బ్యాటింగ్‌‌ చేయలేదు. మేమూ అదే పని చేయాల్సి వచ్చింది. కానీ మా అభిరుచి భిన్నంగా ఉండేది. 

విండీస్‌‌ తరఫున ఆడాలనే అభిరుచి చాలా గొప్పగా ఉండేది. దేశం తరఫున ఆడటం గొప్ప అవకాశం అని గ్రహించాలని యంగ్‌‌ క్రికెటర్లను కోరుతున్నా’ అని లారా పేర్కొన్నాడు. ఇండియాతో జరుగుతున్న రెండు టెస్ట్‌‌ల సిరీస్‌‌లో విండీస్‌‌ ఆట తీరును ఈ సందర్భంగా లారా ప్రశ్నించాడు. ఫ్యాన్స్‌‌లో సాంప్రదాయ ఫార్మాట్‌‌ పట్ల ఆసక్తిని కలిగించడం చాలా కీలకమని అభిప్రాయపడ్డాడు. ‘బిగ్‌‌ త్రీ దేశాలు క్రికెట్‌‌ ఆడేటప్పుడు చాలా మంది వస్తారు. 

ఇంతకంటే గొప్ప క్రికెట్‌‌ రోజు మరోటి లేదని భావిస్తారు. లార్డ్స్‌‌లో ఇండియా– ఇంగ్లండ్‌‌ మ్యాచ్‌‌ చూశాను. దాని బట్టి టెస్ట్‌‌ క్రికెట్‌‌ చనిపోలేదని ఆశిస్తున్నా. చిన్న దేశాలు ఆడటం వల్ల ఫ్యాన్స్‌‌ పెద్దగా రావడం లేదు. స్పాన్సర్లు కూడా దొరకడం లేదు. ఆటపై ఆసక్తి పెంచితే ఇవన్నీ సమసిపోతాయి. అందుకే విండీస్‌‌ టెస్ట్‌‌ క్రికెట్‌‌ గాడిలో పడేందుకు ఓ మార్గం కనుకోవాల్సి ఉంది’ అని లారా వ్యాఖ్యానించాడు. తాను 17 ఏళ్ల కెరీర్‌‌ను టెస్ట్‌‌లు ఆడుతూ గడిపినందుకు చాలా సంతోషిస్తున్నానని చెప్పాడు. 

ఇక టీ20ల్లో దుమ్మురేపుతున్న  ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్‌‌ శర్మపై లారా ప్రశంసలు గుప్పించాడు. అభిషేక్‌‌తో సన్‌‌రైజర్స్‌‌ శిబిరంలో కొంత టైమ్‌‌ గడిపానని చెప్పాడు. ‘అభిషేక్‌‌ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. యువరాజ్‌‌ సింగ్‌‌ ప్రభావం అతనిపై చాలా ఉంది. అతని బ్యాటింగ్‌‌ వేగం, బంతిని కొట్టే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అద్భుతమైన విషయం ఏంటంటే నాకు ఫోన్‌‌ చేస్తాడు. టీ20ల్లో సాధిస్తున్న విజయంతో అతను టెస్ట్‌‌ జట్టులోకి రావడానికి ఓ మార్గాన్ని కనుగొనాలని చూస్తున్నాడు’ అని లారా చెప్పుకొచ్చాడు.