సబితకు మంత్రియోగం దక్కేనా..!

సబితకు మంత్రియోగం దక్కేనా..!

రంగారెడ్డి జిల్లా, వెలుగురాష్ట్ర మంత్రి వర్గ విస్తర్ణపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.  చేవెళ్ల చెల్లెమ్మగా అందరికీ సుపరిచితురాలైన  సబిత మహేశ్వరం నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యే  ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంత్రివర్గ విస్తరణలో సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కతుందా  లేదా అనే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్​ పార్టీ నుంచి గెలుపొంది సబిత ఇటీవల అధికారపార్టీలో చేరిన విషయం తెలసిందే. సీఎం కేసీఆర్​ నుంచి గట్టి హామీతోనే ఆమె టీఆర్​ఎస్​లో చేరారన్న అభిప్రాయం లేకపోలేదు.   గత ప్రభుత్వంలో  మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్​రెడ్డి ఇటీవల లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. సబిత, మహేందర్​రెడ్డిలు సమీప బంధువులు కావడం, సీనియర్​ మంత్రిగా సబితకు అనుభవం ఉండడం వల్ల  సీఎం కేసీఆర్​ ఆమెకే ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు.

మహిళా సెంటిమెంటు

రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటుదక్కకపోవడానికి  అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఆదే కారణంతో తొలి తెలంగాణ క్యాబినెట్​లో మహిళలెవ్వరికీ అవకాశం కల్పించలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్​ఎస్​ పార్టీ తప్పని పరిస్థితుల్లో మంత్రివర్గంలోకి మహిళను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్​ పార్టీతో   సుధీర్ఘ అనుబంధాన్ని  వదులుకుని టీఆర్​ఎస్​లో చేరిన సబితకు మంత్రిపదవి ఇవ్వకపోతే ఏమిటనేది  ఆమె అనుచరవర్గాల్లో చర్చ జరుగుతున్నది.   సీఎం కేసీఆర్​రాజకీయ వ్యూహాల్లో భాగంగా లోక్‌‌సభ ఎన్నికల్లో  టీఆర్​ఎస్​ గెలుపు కోసం సబితను టీఆర్‌‌ఎస్‌‌లోకి ఆహ్వానించారే తప్పా మంత్రి పదవి దక్కడం కష్టమనే వాదన కూడా లేకపోలేదు.  వరంగల్‌‌ జిల్లాకు చెందిన కొండా సురేఖను పార్టీలోకి ఆహ్వానించి ఇందుకు  గతంలో రెండు పర్యాయాలు మంత్రివర్గ విస్తరణలోనూ మంత్రి పదవి ఇవ్వని విషయాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు.  సబితకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే వచ్చిందనుకోవాలని టీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తలు చెబుతున్నారు. జిల్లా నుంచి  జైపాల్‌‌ యాదవ్‌‌, మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి, అంజయ్య యాదవ్‌‌ కూడా  మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.

 బలమైన నాయకురాలు

సబితకు  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టు ఉంది.   ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నేతగా చెప్పుకోవచ్చు.   కాంగ్రెస్‌‌ హాయంలో సీఎం రాజశేఖర్‌‌ రెడ్డి క్యాబినెట్‌‌లో రెండు ధపాలుగా మంత్రిగా పనిచేసిన అనుబవం ఉంది.  నాడు రాజశేఖర్​రెడ్డి  ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం చేవెళ్ల సెంటిమెంట్​తో సబిత నియోజకవర్గం నుంచే ప్రారంభించిన సంఘటనలు ఉన్నాయి.  ఆ సమయంలోనే సబిత జిల్లాకు పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులను తీసుకువచ్చారు.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..?

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతునే ఉన్నాయి. సీఎం కేసీఆర్​ ఆలోచనలను ఎవ్వరూ పసిగట్టలేకపోతున్నారు. ఆగస్టు మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశించారు.  విస్తరణకు మూహూర్తం ఎప్పుడు కుదురుతుందోనని ఎదురుచూస్తున్నారు.  అందులో భాగంగానే  మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గంపెడు ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే జడ్పీ సమావేశాలకు  హాజరయ్యై అవకాశాలు కనిపిస్తున్నాయి.    మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందనే బలమైన విశ్వాసంతో సబితా ఇంద్రారెడ్డి ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.