రూ.2 వేల నోటు ఇక చిత్తు కాగితమేనా..

రూ.2 వేల నోటు ఇక చిత్తు కాగితమేనా..

రెండు వేల రూపాయల నోటును మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ నిర్ణయంతో 2023, సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత 2 వేల నోటు అనేది చిత్తు కాగితంగా మారనుంది. ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా 3.62 లక్షల కోట్ల రూపాయల విలువైన 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ నోట్లు అన్నింటినీ గడువులోగా బ్యాంకుల్లో మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఎవరూ తీసుకోరు.. వాటివి విలువ కూడా ఉండదు. సెప్టెంబర్ 30వ తేదీలోపు మాత్రమే ప్రస్తుతం ఉన్న 2 వేల నోటుకు విలువ ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

ఎందుకు ఈ నిర్ణయం అంటే :

క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2 వేల రూపాయల నోటు బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఉన్న నోట్లు అన్నీ 2017 సంవత్సరానికి ముందు జారీ చేసినవి. వాటి జీవితం కాలం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మాత్రమే అని అప్పట్లోనే నిర్ణయించింది. 2017 తర్వాత 2 వేల నోట్లను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది ఆర్బీఐ. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్ చెలామణిలో ఉన్న 2 వేల నోట్ల విలువ 3 లక్షల 62 వేల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. 

మొత్తం చెలామణిలో దీని వాటా కేవలం 10.8 శాతంగానే ఉంది. ఈ నోట్లు కూడా ప్రస్తుతం చెలామణిలో లేవని.. లావాదేవీలు జరగటం లేదని గుర్తించింది ఆర్బీఐ. బ్యాంకుల్లోకి 2 వేల నోట్లు రాకపోగా.. బ్యాంకులు సైతం ఈ నోట్లను కస్టమర్లకు ఇవ్వటం లేదు. చాలా కొద్ది మొత్తంలో వీటి చెలామణి జరుగుతుంది. సామాన్యుల దగ్గర అయితే 2 వేల నోటు లేదని.. కేవలం 100, 200, 500 నోట్లనే విరివిగా ఉపయోగిస్తున్నారని స్పష్టం చేస్తుంది ఆర్బీఐ. ఈ క్రమంలోనే మార్కెట్ లో ఉన్న పది శాతం.. అంటే 3 లక్షల 62 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి క్లీన్ నోట్ పాలసీ అనే పేరు పెట్టింది. 

సో.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే మీ దగ్గర ఉన్న 2 వేల నోటుకు విలువ.. ఆ తర్వాత అది చిత్తు కాగితం మాత్రమే.. సామాన్యులు, మధ్య తరగతి వారి దగ్గర ఉన్న ఒకటీ, అరా నోట్లు ఏమైనా ఉంటే.. ఈలోపు మార్చుకోండి..