
పప్పు బెల్లాలు, పల్లీల్లాగ భూములు పంచేస్తరా?
ఉద్యమంలో పాల్గొన్నారని అగ్గువకే ఇస్తరా?
వేల మంది పాల్గొన్నారు, వాళ్లందరికీ ఇస్తరా: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి కొందరికి చౌకగా ప్రభుత్వ భూమిని అమ్మేయడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ వాదన ఇదే అయితే ఉద్యమంలో త్యాగాలు చేసిన వేల మందికి ఇచ్చేస్తారా అని ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయానికి ఓ పద్ధతి లేకపోతే రేపు ఎకరం భూమి రూపాయికే ఇచ్చేస్తారా అని మండిపడింది. ప్రభుత్వ ప్రోత్సాహకం పరాధీనం చేస్తున్నట్లు ఉండొద్దని ఘాటుగా కామెంట్ చేసింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదంది. శంకర్‌కు భూ కేటాయింపు విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై అన్ని వివరాలతో సెప్టెంబర్ 15 నాటికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ల డివిజన్ బెంచ్ గురువారం నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది.
దర్శక, నిర్మాత శంకర్‌కు స్టూడియో నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఎకరా రూ.5 లక్షలు చొప్పున 5 ఎకరాలను కే టాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ పాత కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ వేసిన పిల్‌ను గురువారం హైకోర్టు మరోసారి విచారించింది. ‘భూములకు సర్కారు ధర్మకర్తగా ఉండాలి. పప్పు బెల్లాల్లా పంచేయకూడదు. రెండున్నర కోట్ల విలువైన ఎకరా భూమిని రూ. 2 కోట్లకు ఇస్తే ఆక్షేపణ ఎవరికీ ఉండదు. ఎకరా రూ.5 లక్షలకు ఇచ్చిన వాళ్లు రేపు ఒకటి, రెండు రూపాయలకు ఇచ్చేస్తారు కదా? కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెబితే ఎలా? రాయితీపై ఇవ్వడానికి ఓ సరైన ధర ఉండాలి. ఎకరం రూ. 5 లక్షలు చొప్పున 5 ఎకరాలను ఏ లెక్కన రూ.25 లక్షలకే కేటాయించారో చెప్పాలి. ప్రజావసరాల కోసం ఇచ్చే భూములకూ వేలం విధానం అమలు చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది’ అని విచారణ టైమ్ లో కోర్టు కామెంట్ చేసింది. ‘చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడం తప్పు కాదు. కానీ ప్రోత్సాహకాలు శాస్త్రీయంగా లేకపోతే ఎలా? ’ అని ప్రశ్నించింది.