తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ?

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ?

హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందని సమాచారం. ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల నూతన పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పలు రోజులుగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లను ఇప్పటివరకూ షర్మిల గానీ ఆమె అనుచరులు గానీ ధృవీకరించలేదు, అదే సమయంలో ఖండించనూ లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌లోని లోటస్‌‌పాండ్‌‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని షర్మిల నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది. ఈ మీటింగ్ ఎజెండాపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఇప్పటికే YSRCPలోనూ అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. “YSR అభిమానులరా రండి. తరలి రండి! ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాది” అని ఈ మీటింగ్‌‌ మీద సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం కూడా పార్టీ ఏర్పాటు నిజమేననే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

షర్మిల పార్టీ ఏర్పాటులో ఎంత నిజముందో తెలిదు గానీ దీని వెనుక ఎవరున్నారు? ఆమె వ్యూహం ఏమిటనేది ఇంట్రెస్టింగ్‌‌గా మారింది. జగన్ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొంతకాలంగా షర్మిల తీవ్ర నిరాశలో ఉన్నారని రాజకీయ వర్గాల సమాచారం. అయితే ఈమాత్రం దానికే ఆమె కొత్త పార్టీ పెడతారా? పార్టీ పెట్టి ఆమె ఏం సాధించగలరనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆంధ్రపార్టీగా ముద్రపడిన నేపథ్యంలో అలాంటి పార్టీ అధినేత సోదరి పక్క రాష్ట్రంలో కొత్త పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఎలా ఆమోదిస్తారనే క్వశ్చన్స్ కూడా ఉత్పన్నం అవుతున్నాయి. షర్మిల వెనుక TRS ప్రముఖులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కొన్ని రోజులుగా ఒక ప్రచారం సాగుతోంది. బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే ‘రెడ్డి’ సామాజిక వర్గాన్ని చేరదీయడానికి యత్నాలు జరుగుతున్నట్టు వదంతులు వస్తున్నాయి. ఇవి నిజంగా ఎలా వర్కవుట్ అవుతాయో ఊహాజనితమే మరి..!