శ్రీనగర్/న్యూఢిల్లీ: పదేళ్ల కింద పెల్లెట్ గన్ తూటాలకు రెండు కళ్లూ కోల్పోయిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇషా ముస్తాక్‌కు ఎట్టకేలకు న్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా పెల్లెట్ బాధితురాలికి ఈ తరహాలో ప్రభుత్వ పునరావాస సాయం అందడం ఇదే తొలిసారి. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆమెకు మంజూరైన ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ ప్రాజెక్ట్ కోసం రూ.41.16 లక్షల నిధులను విడుదల చేసింది.
అసలేం జరిగింది..?
జులై 2016 కశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హన్ వనీ హతమయ్యాక చెలరేగిన అల్లర్ల సమయంలో భద్రతా బలగాలు ఉపయోగించిన పెల్లెట్ తూటాలు తన ఇంటి కిటికీ ముందు చదువుకుంటున్న ఇషా ముస్తాక్ (14) ముఖానికి తగిలాయి. దీంతో ఆమె కంటి చూపును పూర్తిగా కోల్పోగా, ముఖం తీవ్రంగా దెబ్బతిన్నది. ఢిల్లీ, శ్రీనగర్‌లలో అనేక ఆపరేషన్లు చేసినా చూపు రాలేదు.
