కైరో: ప్రతిష్టాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ముచ్చటగా మూడో మెడల్ అందుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో రజతాలు గెలిచిన ఇషా మెగా టోర్నీలో తొలి వ్యక్తిగత పతకం సొంతం చేసుకుంది. విమెన్స్ 25 మీటర్ల పిస్టల్‌లో కాంస్యం గెలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇషా 30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.
కొరియాకు చెందిన ఒలింపిక్ చాంపియన్ యాంగ్ జీన్ (40) గోల్డ్ గెలుచుకోగా, చైనా షూటర్ యావో క్వియాన్సున్ (38) సిల్వర్ దక్కించుకుంది. పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ నిరాశపరిచింది. 10 సిరీస్‌ల ఫైనల్లో ఎలిమినేషన్స్ మొదలైన తర్వాత ఇషా, మను, ఫ్రాన్స్ షూటర్ లమోలె తలో 23 హిట్స్‌తో కాంస్య పతకం కోసం సమంగా నిలిచారు.
అయితే, కీలకమైన షూటాఫ్‌లో మను రెండు హిట్స్ మాత్రమే కొట్టి రేసు నుంచి తప్పుకుంది. లమోలె 3 హిట్స్ కొట్టగా.. ఇషా 4 హిట్స్‌తో ఆమె అధిగమించి కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. మూడు మెడల్స్ గెలిచిన తెలంగాణ షూటర్ ఇషాకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డి అభినందనలు తెలిపారు.
