T20 World Cup 2026: రెండేళ్ల తర్వాత జట్టులోకి: ఇషాన్ కిషాన్ సెలక్షన్ వెనుక రెండు ప్రధాన కారణాలు ఇవే!

T20 World Cup 2026: రెండేళ్ల తర్వాత జట్టులోకి: ఇషాన్ కిషాన్ సెలక్షన్ వెనుక రెండు ప్రధాన కారణాలు ఇవే!

2026 టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన టీమిండియా స్క్వాడ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ స్థానం సంపాదించాడు. బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో కిషాన్ కు చోటు దక్కింది. సౌతాఫ్రికా సిరీస్ ముందు వరకు కిషాన్ వరల్డ్ కప్ సన్నాహాల్లో లేకపోయినా ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి జట్టులోకి వచ్చాడు. 2023 నవంబర్ లో చివరిసారి టీమిండియా తరపున ఆడిన ఈ జార్ఖండ్ వీరుడు రెండేళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

కిషాన్ జట్టులోకి రావడంతో ఫామ్ లో లేని గిల్ పై వేటు తప్పలేదు. నిన్నటివరకు వైస్ కెప్టెన్ గా కొనసాగిన గిల్.. ఒక్కసారిగా జట్టులో చోటు కోల్పోతే మరోవైపు కిషాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. కిషాన్ స్క్యాడ్ లో ఉండడానికి ఖచ్చితంగా అర్హుడు. వీటికి రెండు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 
   
1) ఇన్నింగ్స్ ఓపెన్ చేయగలడు:

ఇషాన్ కిషన్ ఓపెనర్ కావడం అతనికి అడ్వాంటేజ్. ప్రస్తుతం టీమిండియాలో గిల్ ఫామ్ లో లేకపోవడంతో సంజు శాంసన్ కు బ్యాకప్ ఎవరనే ప్రశ్నకు కిషాన్ రూపంలో సమాధానం దొరికింది. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషాన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో మొత్తం 57.44 యావరేజ్ తో 517 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 200 ఉండడం విశేషం. జార్ఖండ్ తరపున ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో చెలరేగి ఆడాడు. గురువారం (డిసెంబర్ 18) పూణే వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాపై బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు ఏకంగా 10 సిక్సర్లు ఉన్నాయి.

2) వికెట్ కీపింగ్ చేయగలడు:

వికెట్ కీపర్ కావడం కిషాన్ కు మరో అడ్వాంటేజ్. టీమిండియాలో ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ లిస్ట్ చూసుకుంటే సంజు శాంసన్ ఒక్కడే కనిపిస్తున్నాడు. జితేష్ శర్మను నిలకడ లేదు. ధృవ్ జురెల్ ఉన్నప్పటికీ దూకుడుగా ఆడలేడనే పేరుంది. పంత్ గాయాలతో సతమవుతున్నాడు. అదే సమయంలో ఇషాన్ కిషాన్ దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి వీరందరికీ చెక్ పెట్టాడు. గతంలో టీమిండియాకు ఆడిన అనుభవం ఇషాన్ కు ఉంది. సంజు శాంసన్ గాయపడితే వికెట్ కీపర్ గా ఓపెనింగ్ చేయగలడు. ఒకవేళ అభిషేక్ అందుబాటులో లేకపోతే సంజుతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలా టాపార్డర్ లో రెండు విధాలుగా కిషాన్ సేవలను వాడుకోవచ్చు. 

వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్:  

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా