ఉగ్రకలకలం.. పోరుబందర్ టు రామగుండం వయా హైదరాబాద్

ఉగ్రకలకలం.. పోరుబందర్ టు రామగుండం వయా హైదరాబాద్
  • సమీరా భాను కేంద్రంగా ఐఎస్ కేపీనెట్వర్క్ విస్తరణ
  • యువతను ట్రాప్ చేస్తున్నట్టు గుర్తించిన ఏటీఎస్
  • హైదరాబాద్, రామగుండం,హనుమకొండలో తనిఖీలు
  • రామగుండలంలో తండ్రీకూతుళ్ల అరెస్ట్
  • కూతురు కాల్ డేటా ఆధారంగా 12 మంది అనుమానితుల గుర్తింపు
  • కాలాపత్తర్ మెడికల్ షాపు ఓనర్ స్టేట్ మెంట్ రికార్డ్
  • హనుమకొండలో ఇద్దరి అదుపులోకి తీసుకున్న ఏటీఎస్
  • సమీరా భాను కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా సోదాలు

తెలంగాణలో ఉగ్రవాద కార్యకలాపాల లింకులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ లోని పోరుబందర్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ కేపీ( ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావిన్సీ) నెట్ వర్క్ హైదరాబాద్ మీదుగా రామగుండం వరకు విస్తరించిందని తెలుస్తోంది. రామగుండం కు చెందిన జావిద్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ లో జావిద్ సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. తండ్రీ కూతుళ్లు టోలీచౌక్ లో నివాసం ఉంటున్నారు. జావిద్ కూతురు ఖాతిజాతో ఐఎస్ కేపీ నెట్ వర్క్ విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తున్న సమీరా భాను టచ్ లో ఉన్నట్టు ఏటీఎస్(యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) అధికారులు గుర్తించారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలను, కాల్ డేటాను పరిశీలించారు. బక్రీద్ పండుగ కోసం తండ్రీ కూతుళ్లిద్దరూ రామగుండం వెళ్లారు.

దీంతో అక్కడికి వెళ్లిన ఏటీఎస్ అధికారులు వీళ్లిద్దరినీ ఉగ్రవాద కార్యకలాపాలు, ఐఎస్ కేపీ లో లింకులపై ప్రశ్నించారు. సమీరా భాను తో ఎప్పటి నుంచి ఎలా పరిచయమో ఆరా తీశారు. వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. ఖాతిజా, జావిద్ మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.ఖాతిజా కాల్ డేటా ఆధారంగా మహారాష్ట్ర, బెంగళూరు, గోవాకు చెందిన 12 మంది అనుమానితులను గుర్తించారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం హనుమకొండకు చెందిన మరో ఇద్దరికి ఐఎస్ కేపీతో సంబంధాలున్నట్టు గుర్తించిన ఏటీఎస్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

ఎవరీ సమీరా భాను ?

గుజరాత్ లోని సూరత్ కు చెందిన సమీరా భాను బంగ్లాదేశ్ మాడ్యూల్ కు చెందిన ఐఎస్ కేపీ( ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావిన్సీ) నెట్ వర్క్ విస్తరణలో కీలకంగా పనిచేస్తున్నట్టు ఏటీఎస్ భావిస్తున్నది. సమీరా భాను, జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన ఉబైర్ నసీన్, హనన్ హయత్ షా, మహమ్మద్ అజీం పాషా గుజరాత్ లోని పోరుబందర్ నుంచి సముద్ర మార్గంలో ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలని భావించారు. పక్కా సమాచారంతో ఏటీఎస్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా లింక్ బయటపడింది. సమీరాబాను భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు సోషల్ మీడియా వేదికగా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఏటీఎస్ నిర్ధారణకు వచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని కాలాపత్తర్ కు చెందిన మెడికల్ షాపు యజమాని ఫసి ఉల్లా అనే వ్యక్తితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించిన ఏటీఎస్ అధికారులు నిన్న హైదరాబాద్ చేరుకొని ఫసి ఉల్లాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆయన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

సమీరాబాను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన ఉబైర్ నసీన్, హనన్ హయత్ షా, మహమ్మద్ అజీం పాషాను ఆన్ లైన్ ద్వారానే సంప్రదించి ఉగ్రవాదం వైపు మళ్లించినట్టు ఏటీఎస్ భావిస్తోంది. ఆమె కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్, వాట్సాప్ చాట్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమె ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు..? ఎలాంటి కార్యకలాపాలకు స్కెచ్ వేశారు..? అనే కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 
  
ఇటీవల పొరుబందర్‌లో పట్టుబడ్డ ఐఎస్ కేపీ ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీయగా.. పాతబస్తీలో ఉగ్ర కార్యకలాపాలు నడిపేందుకు ప్రయత్నించిన సుబేరాభాను అనే మహిళను అహ్మదాబాద్‌ ఏటీఎస్‌ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఫసీఉల్లా అనే వ్యక్తితో సుబేరాకు సంబంధాలున్నట్లు గుర్తించారు. ఫసీని కూడా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తనఖీలు చేసింది గుజరాత్ ఏటీఎస్ బృందం. 

ఐఎస్ఐఎస్ కు ఐఎస్ కేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలలో సుబేరా భాను అనే యువతీ ప్రధాన సూత్ర దారిగా వ్యవహరిస్తోంది. సుబేరా భాను పలువురుని ఆన్ లైన్ ద్వారా ఉగ్ర కార్యకలాపాల్లోకి లాగుతున్నట్లు గుర్తించారు.