- ఎన్నికలు రాగానే నిద్ర లేస్తడు.. అయిపోగానే నిందలేస్తడు
- బీఆర్ఎస్ పాలనలోనే ప్రాజెక్టుల నిర్మాణం: హరీశ్ రావు
గంగాధర, వెలుగు: ‘సీఎం రేవంత్ కర్ణుడు కాదు.. క్రూరుడు, కుంభకర్ణుడు, ఎన్నికలు రాగానే నిద్ర లేస్తడు, పూర్తికాగానే కేసీఆర్, బీఆర్ఎస్ నేతల మీద నిందలేస్తూ కాలక్షేపం చేస్తడు’ అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి- కురిక్యాల సమీపంలోని వరద కాలువను శనివారం ఆయన పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసినప్పుడు రోధిస్తున్న బాధితులను చూసి పోలీసులు సైతం కంటతడి పెట్టారని, ఆ వీడియోలు చూసి రాష్ట్రమంతా శోకించినా వీసమెత్తు కూడా బాధపడని క్రూరుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
ఎన్నికల ముందు రైతుబంధు ఇస్తామని, ఆ తర్వాత ఎగ్గొడతారని విమర్శించారు. ‘నేను రుణమాఫీ చేసిన, రైతుబంధు వేసిన.. కానీ అవి పడ్డాయో లేదో నాకు తెల్వదు’ అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ పాలనలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి వరద కాల్వను రిజర్వాయర్‌గా మార్చామని, మిడ్ మానేరు, అనంతసాగర్, మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామన్నారు. రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మించినట్లు చెప్పారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతూ వారి బతుకులు ఆగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం గంగాధర మండలం గోపాల్‌రావుపల్లి, మల్లాపూర్‌లో ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, నాయకులు పాల్గొన్నారు.
