ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా గజగజ

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా గజగజ
  • ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా గజగజ
  • దండయాత్రకూ సిద్ధమేనన్న నెతన్యాహు, ఐడీఎఫ్ చీఫ్  
  • ఇజ్రాయెల్ నిర్ణయం ఏదైనా మద్దతిస్తామన్న బైడెన్ 
  • హమాస్​ను సమర్థించిన యూఎన్ చీఫ్​పై ఇజ్రాయెల్ ఫైర్

గాజా/జెరూసలెం:  గాజా స్ట్రిప్ లోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై వరుసగా 19వ రోజూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. బుధవారం కూడా వందలాది బాంబుదాడులతో గాజా స్ట్రిప్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ తాజా ఎయిర్ స్ట్రైక్స్​లో అనేక బిల్డింగ్​లు నేలమట్టం కాగా, మరో 87 మంది చనిపోయారు. ఒకవైపు గాజాలోని టార్గెట్లను నేలమట్టం చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) మరోవైపు ఉత్తరాదిన వెస్ట్ బ్యాంక్​లోని మిలిటెంట్లపైనా దాడులు చేస్తోంది. అలాగే లెబనాన్ నుంచి రాకెట్ దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూప్ పైనా ప్రతిదాడులు చేస్తోంది. అటు సిరియా రాకెట్ దాడులనూ తిప్పికొడుతోంది. బుధవారం సిరియాలోని రాకెట్ లాంచింగ్ ప్రదేశాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇప్పటికే రెండు ఎయిర్ పోర్టులను ధ్వంసం చేసిన ఐడీఎఫ్.. తాజాగా అలెప్పో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని రన్ వేనూ ధ్వంసం చేసింది. 

గాజాలోకి చొరబడి హమాస్ మిలిటెంట్లను ఏరివేసేదాకా యుద్ధం ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి తేల్చిచెప్పారు. గాజాపై దండయాత్రకు సిద్ధంగా ఉన్నామని, సరైన సమయం కోసం వేచిచూస్తున్నామని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి కూడా బుధవారం ప్రకటించారు. కాగా, హెజ్బొల్లా గ్రూప్ లీడర్ హసన్ నస్రల్లా బుధవారం హమాస్ లీడర్ సలేహ్ అల్ అరౌరీతో, ఇస్లామిక్ జిహాద్ నేత జియాద్ అల్ నఖ్లేహ్ తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ దాడులను ఆపడంతోపాటు శత్రువుపై ఉమ్మడిగా విజయం సాధించాలని ఈ మీటింగ్​లో ముగ్గురు నేతలు నిర్ణయించినట్లుగా ప్రకటించారు. 

5,791కి పెరిగిన డెత్స్ 

ఇజ్రాయెల్ దాడులతో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 5,791కి పెరిగిందని బుధవారం గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. క్షతగాత్రుల సంఖ్య 16,297కు చేరిందని తెలిపింది. వెస్ట్ బ్యాంక్ లో  100 మంది పాలస్తీనియన్లు చనిపోగా, 1,650 మంది గాయపడ్డారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ లో 1,400 మంది చనిపోయారు. 

రోజుకు రూ. 2 వేల కోట్ల ఖర్చు 

గాజా స్ట్రిప్​లోని హమాస్ మిలిటెంట్లపై పోరాటం కోసం తమ దేశానికి రోజుకు100 కోట్ల షెకెల్స్ (రూ. 2 వేల కోట్లు) ఖర్చు అవుతోందని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ వెల్లడించారు. బుధవారం ఆయన ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో ద్వారా మాట్లాడారు. యుద్ధం వల్ల తాము నేషనల్ బడ్జెట్​ను సవరించుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

నాన్నా.. 10 మంది యూదులను చంపేశా ఓ మహిళను చంపి ఆమె ఫోన్​తో తండ్రికి కాల్ చేసిన మిలిటెంట్

 
టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ల నరమేధానికి సంబంధించిన ఆధారాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. గాజా బార్డర్​కు సమీపంలోని కిబుజ్ గ్రామంలో ఓ మహిళను, ఆమె భర్తను చంపేసిన ఓ మిలిటెంట్ ఆమె ఫోన్​తో తన తండ్రికి కాల్ చేసిన ఆడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. ‘‘నాన్నా నేను10 మంది యూదులను చంపేశా. ఆ ఫొటోలను వాట్సాప్​లో పంపాను. మీ కొడుకు ఎంతమందిని చంపాడో చూడండి” అంటూ మిలిటెంట్ తన తండ్రికి చెప్పినట్లుగా అందులో రికార్డ్ అయింది.

కంటైనర్లలో శవాల కుప్ప!

ఇజ్రాయెల్ లో అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల దాడుల్లో చనిపోయిన వందలాది మంది మృతదేహాలను కంటైనర్లలో భద్రపర్చారు. మిలిటెంట్లు డెడ్​ బాడీలను ఛిద్రం చేయడం, తగలబెట్టడంతో మృతులను గుర్తించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో షురా మిలిటరీ బేస్ వద్ద డెడ్ బాడీలను ఫ్రీజర్లలో ఉంచి కంటైనర్లలో ఉంచారు.