మొస్సాద్ ఎటు పోయింది?..హమాస్‌‌‌‌ దాడిని పసిగట్టడంలో ఫెయిల్

మొస్సాద్  ఎటు పోయింది?..హమాస్‌‌‌‌ దాడిని పసిగట్టడంలో ఫెయిల్
  •     హమాస్‌‌‌‌ దాడిని పసిగట్టడంలో ఇజ్రాయెల్‌‌‌‌ నిఘా వ్యవస్థ ఫెయిల్
  •     ప్రపంచంలోనే నంబర్ వన్ స్పై ఏజెన్సీ ‘మొస్సాద్‌‌‌‌’ గుర్తించలేదా?

జెరూసలెం: ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ.. అత్యున్నత టెక్నాలజీ.. ముప్పును ముందే పసిగట్టి గుట్టుచప్పుడు కాకుండా లక్ష్యాన్ని పూర్తి చేయగల గూఢచారులు.. ఇజ్రాయెల్ గురించి తరచూ వినిపించే మాటలివి. కానీ శనివారం నేల, నీరు, గాలి నుంచి హమాస్ చేసిన ముప్పేట మెరుపు దాడితో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే 5 వేల రాకెట్లను ప్రయోగించేలా హమాస్ సిద్ధమైనా.. పారాగ్లైడింగ్ చేసి చొరబడుతున్నా.. నేరుగా సరిహద్దులు దాటి వస్తున్నా.. పసిగట్టలేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది దేశ గూఢచార సంస్థల భారీ వైఫల్యమేనని ఎక్స్‌‌‌‌పర్టులు మండిపడుతున్నారు.

షిన్‌‌‌‌బెట్, మొస్సాద్ ఏం చేస్తున్నట్లు?

ప్రపంచంలోని స్పై ఏజెన్సీల్లో ఇజ్రాయెల్‌‌‌‌కు చెందిన ‘మొస్సాద్’ తొలి స్థానంలో ఉంటుంది. అంతటి ట్రాక్ రికార్డు మొస్సాద్‌‌‌‌కు ఉంది. ఇది ఇజ్రాయెల్ ఎక్స్‌‌‌‌టర్నల్ స్పై ఏజెన్సీ. ఇక షిన్ బెట్.. డొమెస్టిక్ యూనిట్. నిరంతర ఘర్షణ వాతావరణం ఉండే గాజా సరిహద్దుల్లో పటిష్టమైన మిలిటరీ భద్రత ఉంటుంది. భద్రతా కెమెరాలు, ఫీల్డ్‌‌‌‌లో షిన్ బెట్, మొస్సాద్ అధికారులు, అత్యాధునిక థర్మల్ ఇమేజింగ్/మోషన్ సెన్సర్లు, అధునాతన సరిహద్దు ఫెన్సింగ్ ఉన్నాయి. అయినప్పటికీ వీటన్నింటినీ దాటుకుని వేల రాకెట్లు ఇజ్రాయెల్‌‌‌‌ బిల్డింగులను తాకాయి. పారాగ్లైడర్లు ఇజ్రాయెల్‌‌‌‌ నేలపై దిగి.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కొందరు సముద్ర మార్గంలో చిన్న బోట్లలో వచ్చారు. ఇంకొందరు బుల్డోజర్లతో ఫెన్సింగ్‌‌‌‌ను తొలగించి చొరబడ్డారు. ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదని, ఎప్పటి నుంచో పథకం రచించి.. పక్కాగా అమలు చేసినట్లు కనిపిస్తున్నది. కానీ నిఘా ఏజెన్సీలు మాత్రం కనిపెట్టలేకపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్‌‌‌‌కు అమెరికా ఎప్పటినుంచో భాగస్వామి. కానీ ఫైవ్ ఐస్ (ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా) దేశాలు కూడా ఈ దాడి గురించి ఇజ్రాయెల్‌‌‌‌ను హెచ్చరించలేదు.

ఇరాన్‌‌‌‌పై ఫోకస్ పెట్టి.. 

ఇరాన్‌‌‌‌ను ఎదుర్కోవడంలో, ఆ దేశ అణు కార్యక్రమాన్ని విఫలం చేసే ప్రయత్నాల్లో ఇజ్రాయెల్ మునిగిపోయిందని, ఇదే సమయంలో తన ‘పెరట్లో’ ఏం జరుగుతున్నదో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని నిపుణులు విమర్శిస్తున్నారు. “ఇజ్రాయెల్‌‌‌‌లోని వారంతా తమను తాము ప్రశ్నించుకుంటున్నారు.. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) ఎక్కడ? పోలీసులు ఎక్కడ? భద్రత ఎక్కడ? అని అడుగుతున్నారు. ఇది భారీ వైఫల్యం” అని ఇజ్రాయెల్ నేవీ మాజీ చీఫ్ ఎలి మారన్ విమర్శించారు.