- 21 మందికి తీవ్ర గాయాలు
- దక్షిణ లెబనాన్‌లో భీకర పోరు
- హెజ్బొల్లా ప్రతిఘటనతో పరిస్థితి ఉద్రిక్తం
బీరుట్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతమైన జ్నా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడటంతో ఐదుగురు మరణించగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖల్దే ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు బలయ్యారు. బీరుట్‌లోని పాఠశాల సమీపంలో నిలిపి ఉంచిన వెహికల్స్‌పై ఇజ్రాయెల్ మిసైల్స్‌తో విరుచుకుపడింది.
హెజ్బొల్లాకు చెందిన ఒక సీనియర్ కమాండర్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే, హెజ్బొల్లా దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు. దాడుల తీవ్రతకు భయపడి జనం ఇండ్లను వదిలి వెళ్లిపోతుండటంతో హదత్‌లాంటి ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
యుద్ధ భూమిగా దక్షిణ లెబనాన్
దక్షిణ లెబనాన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ దళాలను హెజ్బొల్లా గెరిల్లాలు గట్టిగా అడ్డుకుంటున్నారు. సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న షామా పట్టణంలో ఇరు వర్గాల మధ్య ‘భీకర పోరు’ సాగుతున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. హెజ్బొల్లా ప్రయోగించిన 40కి పైగా రాకెట్లు ఉత్తర ఇజ్రాయెల్‌ను వణికించాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 10 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్టు సమాచారం.
ఈ వారంలో జరిగిన హింసలో ముగ్గురు యూఎన్‌వో శాంతి పరిరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో ఇప్పటివరకు 1,200 మందికి పైగా మరణించగా, సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
