
గాజాస్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 103 మంది చనిపోయారు. శనివారం అర్ధరాత్రి దాటాక మొదలైన దాడులు.. ఆదివారం తెల్లవారుజాము దాకా కొనసాగాయి. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, క్యాంపులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఖాన్‌యూనిస్‌లో 48 మంది, నార్త్ గాజాలో 29 మంది, జబాలియాలోని రెఫ్యూజీ క్యాంప్‌లో 26 మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఖాన్ యూనిస్‌లో చనిపోయిన 48 మందిలో 18 మంది చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జబాలియాలోని రెఫ్యూజీ క్యాంప్‌లో తలదాచుకుంటున్న వారిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. జబాలియాలోని ఓ ఇంటిపై జరిగిన వైమానిక దాడిలో 10 మంది చనిపోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఓ మహిళ ఉన్నది. ప్రజలను రక్షణ కవచాలుగా మార్చుకుని హమాస్ మిలిటెంట్లు తమపై దాడులకు పాల్పడుతున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
సివిలియన్ ఏరియాల్లోనే హమాస్ మిలిటెంట్లు తలదాచుకుంటున్నట్లు వివరించింది. అయితే, తాజా దాడులపై మాత్రం ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ మిలిటెంట్లు తూట్లు పొడుస్తున్నారని మండిపడింది. మరో కొత్త సీజ్ ఫైర్ డీల్‌కు ఒప్పుకుంటేనే గాజాపై దాడులు ఆపుతామని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. తమ వాళ్లను విడుదల చేయడానికి హమాస్ నిరాకరిస్తున్నదని, అందుకే దాడులు చేస్తున్నామని తెలిపింది.
కాగా, మార్చిలో చేసుకున్న సీజ్ ఫైర్ డీల్‌ను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని గాజా హెల్త్ మినిస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మార్చి 15 నుంచి సుమారు 3 వేలకు పైగా పాలస్తీనియులను ఇజ్రాయెల్ పొట్టనపెట్టుకున్నదని తెలిపింది. 3 రోజుల్లోనే 250 మంది చనిపోయారని చెప్పింది. 2023, అక్టోబర్‌లో యుద్ధం మొదలైందని, ఇప్పటి వరకు 53 వేల మంది పాలస్తీనియులు మృతి చెందినట్లు వివరించింది.