2030 కల్లా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ సిద్ధం 

 2030 కల్లా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ సిద్ధం 

న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో అగ్రదేశాలకు దీటుగా సత్తా చాటుతున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) రీయూజెబుల్ రాకెట్ అభివృద్ధిపైనా ఫోకస్ పెట్టింది. 2035 కల్లా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్న ఇస్రో.. ఇందుకోసం 10, 20 టన్నుల బరువును సైతం మోసుకెళ్లే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) తయారీపై దృష్టిసారించింది. మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలుగా (రీయూజెబుల్) ఈ రాకెట్​ను తయారు చేస్తున్నామని, ఇందులో ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ పిలుపునిచ్చారు.

జియో స్టేషనరీ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్(జీటీవో)లోకి 10 టన్నుల పేలోడ్​ను, లో ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈవో)లోకి 20 టన్నుల పేలోడ్ ను మోసుకెళ్లేలా ఎన్జీఎల్వీ రాకెట్​ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2035 కల్లా సొంత స్పేస్ స్టేషన్​ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు మానవ అంతరిక్ష యాత్రలు, ఒకేసారి ఎక్కువ కమ్యూనికేషన్ శాటిలైట్ల ప్రయోగాలను ఇస్రో  చేపట్టనుందని వెల్లడించారు. ఈ ప్రయోగాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా 2030 కల్లా ఎన్జీఎల్వీని సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.