15వందల ఇండ్లు.. 15ఏండ్లుగా పడావు!

15వందల ఇండ్లు.. 15ఏండ్లుగా పడావు!

ఖాళీగా శంషీగూడ జేఎన్​ఎన్ యూఆర్ఎం నిర్మాణాలు

కూకట్​పల్లి, వెలుగు: శంషీగూడ పరిధిలో 15 ఏండ్ల కిందట నిర్మించిన ఇండ్లకు ఇంకా మోక్షం కలగట్లేదు. లబ్ధిదారులకు అందకపోగా.. అవి శిథిలావస్థకు చేరినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. తమ కోసం కట్టిన ఇండ్లను ఏండ్లుగా ఎందుకు ఇవ్వట్లేదో అర్థంకాక లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. 2008లో కాంగ్రెస్​ ప్రభుత్వం బాలానగర్ మండలం(ప్రస్తుతం కూకట్​పల్లి మండలం) పరిధిలోని శంషీగూడలో జేఎన్​ఎన్ యూఆర్ఎం(జవహర్​లాల్ నెహ్రూ నేషనల్​అర్బన్​ రెనెవల్ ​మిషన్) హౌసింగ్​ స్కీమ్ ​పేరుతో గృహ సముదాయాల నిర్మాణాలకు జీ ప్లస్​త్రీ ప్లాన్​రూపొందించి సర్వే నంబర్​336లోని 65 ఎకరాల భూమిని కేటాయించింది. మొత్తం 3,340 ఫ్లాట్లను నిర్మించటానికి ప్రణాళికలు తయారు చేయగా సీఎం వైఎస్​రాజశేఖర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. సిటీలోని  బోరబండ, సికింద్రాబాద్, లాలాగూడ, అంబర్​పేట, యూసుఫ్​గూడ, ఖైరతాబాద్​తో పాటు ఓల్డ్ సిటీ నుంచి కూడా లబ్ధిదారులను ఎంపికచేశారు. లబ్ధిదారులు కూడా భాగస్వాములే
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు లబ్ధిదారులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. 50 శాతం నిధులు కేంద్రం,  20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, మరో 30 శాతం నిధులు లబ్ధిదారులు కట్టాలని నిర్ణయించింది. లబ్ధిదారుల నుంచి ఆ నిధులను దశల వారీగా కట్టించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు త్వరగా ఇవ్వడంతో ఇండ్ల నిర్మాణాలు సకాలంలోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలతో  ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియ ముందుకు సాగలేదు. కొద్దిమందికి  అప్పగించినా, సౌలతులు లేక వచ్చి ఉండేందుకు ఆసక్తి చూపట్లేదు. కొందరు లబ్ధిదారులు కొన్నాళ్లు ఉండి ఆ తర్వాత ఖాళీ చేసి తిరిగి అద్దె ఇండ్లలోకి వెళ్లిపోయారు. ఇందుకు ప్రధాన కారణం రోజూవారి పనులకు శంషీగూడ నుంచి సిటీకి వెళ్లి రావడం కష్టంగా మారడం,  రవాణా సదుపాయాలు కూడా లేకపోవడంతో ఇవి దళారులకు వరంగా మారాయి. ఖాళీ ఇండ్లను  దళారులు తమ పలుకుబడితో కొన్నింటిని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంకొందరు అమ్ముకుని వెళ్లిపోయారు.  

సర్వేలు చేసి, నివేదికలు రూపొందించినా..

శంషీగూడలో నిర్మించిన  జేఎన్​ఎన్​యూఆర్​ఎం ఇండ్లు నిరుపయోగంగా ఉంటుండగా, వాటిపై అధికారులు  పలు సర్వేలు చేసి నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశారు. ఇక్కడి సమస్యలు, వాటికి పరిష్కారాలపై పలు సూచనలు చేశారు. సర్వే రిపోర్టులు, పరిష్కార నివేదికలు బయటకు వచ్చాయి. శంషీగూడ ఇండ్ల నిర్మాణ పనులు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, వాటి పనులు మాత్రం హైదరాబాద్​ జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో ఇక్కడ ఇండ్లు పొందే లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కూడా వారికే కట్టబెట్టారు. ఆ తర్వాత పాలనా పరంగా పలు మార్పులు జరిగాయి. అప్పటి రంగారెడ్డి జిల్లా వేరు పడి ప్రస్తుతం శంషీగూడ మేడ్చల్​ జిల్లా పరిధిలోకి మారింది. ఇప్పటికీ శంషీగూడలోని ఇండ్ల బాధ్యత హైదరాబాద్​జిల్లా అధికారుల చేతుల్లోనే ఉంది. పదిసార్లకు పైగా అధికారులు వచ్చి సర్వేలు చేసి నివేదికలు తయారు చేసి హైదరాబాద్​ కలెక్టర్​ ఆఫీసులో అందజేశారు. రెండేండ్ల కిందట కూడా నివేదిక ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

తాగునీటి ఇబ్బందులే కారణంగా..

ఇండ్ల నిర్మాణాలప్పుడు శంషీగూడ శివారు ప్రాంతంగా ఉంది. ప్రస్తుతం అన్ని విధాలు గా అభివృద్ధి చెందింది.  కేపీహెచ్​బీకాలనీ నుంచి జీడిమెట్లకు వెళ్లే ఉషా ముళ్లపూడి రోడ్డు పక్కనే జేఎన్​ఎన్​యూఆర్ఎం ఇండ్లు ఉండగా వీటిలో ఉండేందుకు ఇప్పటికీ ఎక్కువ శాతం మంది లబ్ధిదారులు ఆసక్తి చూపట్లేదు. ఇందుకు ప్రధాన కారణం తాగునీటి సమస్య. దీని పరిష్కారానికి రెండేండ్ల కిందట వాటర్​వర్క్స్​అధికారులు నీటి పైపులు వేశారు. నెలలో పది రోజులు మాత్రమే నీటి సరఫరా జరుగుతుండగా, అవి సరిపోక స్థానికులకు ఇబ్బందులు పడ్డారు. నీటి సరఫరాలోనూ సమయ పాలన లేకపోవడం కూడా ప్రధాన సమస్య గా మారింది.  తక్కువ ప్రెజర్​వస్తుండగా  గ్రౌండ్​ఫ్లోర్​వరకు నీళ్లు అందుతాయి. జీ ప్లస్​ త్రీ ఫ్లోరులో ఉండేవాళ్లు 3 ఫ్లోర్ల కిందకు దిగి నీళ్లు పట్టుకోవాల్సి పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఇబ్బంది భరించలేని వారు ఇండ్లలో ఎక్కువగా ఉండట్లేదు. 

ఎక్కువ ఇండ్లు వృథాగానే..

3 వేలకు పైగా  ఇండ్లను నిర్మించగా, ఇందులో సగానికి పైగా వృథాగా ఉన్నాయి. ఇక్కడ ఉంటున్నవారిలో కూడా సగం మంది మాత్రమే అసలు లబ్ధిదారులు కాగా, మరోసగం మంది దళారుల నుంచి లక్షల రూపాయలు పోసి కొనుగోలు చేసిన వారు ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 1500  ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని పట్టించుకునే వారు లేకపోవడంతో దొంగలు ఇండ్ల కిటికీలు, తలుపులు ఎత్తుకెళ్లి అమ్ము కుంటున్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక పనులకు అడ్డాగాను మారాయి.