
హైదరాబాద్, వెలుగు: సంస్కృతం పేపర్లో క్వశ్చన్ల రిపీట్, కోదాడలో సంస్కృతం పేపర్‌కు బదులు కెమిస్ట్రీ పేపర్ ఇవ్వడం వంటి ఘటనలు మరువక ముందే.. హిందీ మీడియం పేపర్లను ఇంటర్ బోర్డు ప్రింట్ చేయట్లేదనే విషయం బయటపడింది. జవాబులతోపాటు ప్రశ్నలనూ విద్యార్థులే రాసుకోవాల్సి వస్తున్నది. బుధవారం పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రం హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేసి చేతితో రాసిన కాపీ బయటకు వచ్చింది. దీంతో హిందీ మీడియంలో ప్రశ్నాపత్రాలను బోర్డు ప్రింట్ చేయడం లేదని తేలింది. ఎగ్జామ్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్లకు ఆ పేపర్‌ను ఇంగ్లిష్ నుంచి హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేసి చెప్తున్నారు. ఆ ప్రశ్నలను విద్యార్థులు రాసుకొని, ఆ తర్వాత జవాబులు రాస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ప్రశ్నాపత్రాన్ని ట్రాన్స్‌లేట్ చేసి, ఆ కాపీని జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇస్తున్నారు. మరాఠీ, కన్నడ మీడియం స్టూడెంట్లదీ ఇదే పరిస్థితి. గత ఏడాది హిందీ మీడియంలో ప్రశ్నా పత్రాలు ప్రింట్ చేసినా.. ఈ సారి ప్రింట్ చేయలేదు. మరాఠీ, కన్నడ మీడియంలలో మూడు దశాబ్దాల నుంచి ట్రాన్స్లేషన్ పద్ధతే కొనసాగుతున్నదని బోర్డు ప్రతినిధులు అంటున్నారు.
ముందే చెప్పినమంటున్న బోర్డు.. కానీ..!
రాష్ట్రంలో ఇంటర్ హిందీ మీడియం విద్యార్థులు ఆదర్శ హిందీ మహావిద్యాలయం(నిజామాబాద్), హిందీ మహా విద్యాలయ జూనియర్ కాలేజీ (హైదరాబాద్)లో మాత్రమే చదువుతున్నారు. వీళ్లు 56 మంది ఉన్నారు. దీంతో ఈ స్టూడెంట్లకు ఆ ప్రాంతంలో జంబ్లింగ్ కూడా వేయకుండా, ఒకే కాలేజీలో ఇంటర్ బోర్డు అధికారులు సెంటర్ అలాట్ చేశారు. హిందీ మీడియం ప్రశ్నాపత్రాల తయారీకి ముందుగానే ట్రాన్స్‌లేటర్లను రెడీగా పెట్టుకోవాలని, తాము ప్రింట్ చేయబోమని మార్చి 5న ఆ 2 కాలేజీలకు సర్క్యులర్ పంపినట్లు ఇంటర్ బోర్డు చెప్తోంది. హిందీ మీడియం ప్రశ్నాపత్రాలను ప్రింట్ చేయని విషయం గురించి హైదరాబాద్ డీఐఈఓ ఒడ్డెన్నకు ‘వెలుగు’ ప్రతినిధి కాల్ చేసి ఆరా తీయగా.. తనకు విషయం తెలియదని, తెలుసుకుంటానని చెప్పారు.
హిందీ మీడియం క్వశ్చన్ పేపర్లను కావాలనే ప్రింట్చేయట్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నరు. తెలుగు, ఇంగ్లీష్ పేపర్ల నుంచి మిగిలిన మీడియంలోకి రెగ్యులర్ లెక్చరర్లు ట్రాన్స్‌లేట్ చేస్తారు. హిందీ మీడియంలో రెగ్యులర్ లెక్చరర్లు లేరు. క్వశ్చన్ పేపర్ల తయారీ కాన్ఫిడెన్షియల్ వర్క్. హిందీ మీడియంలో సీఈసీ స్టూడెంట్లు మాత్రమే ఉన్నారు. హిందీ, మరాఠీ, కన్నడ మీడియం పుస్తకాలను ప్రింట్ చేయట్లేదు. స్టూడెంట్లు, మేనేజ్మెంట్ల విజ్ఞప్తితోనే ఆ కాలేజీల్లో పర్మిషన్ ఇచ్చాం. ట్రాన్స్‌లేటర్లను పెట్టుకోవాలని ముందే చెప్పాం.
- ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు సెక్రటరీ