మమ్మల్ని నిర్బంధించలేదు

మమ్మల్ని నిర్బంధించలేదు
  • హైకోర్టు ముందు ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగుల వెల్లడి

తమను ఎవరూ నిర్బంధించలేదని ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులు హైకోర్టు ముందు వెల్లడించారు. తమ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, గురుడు చంద్రశేఖర్, రెబ్బల విక్రమ్ గౌడ్, కందులూరి ఫణికుమార్​ను తెలంగాణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్​ అశోక్ ఆదివారం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ ఉద్యోగులను తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం 10.30 గంటలకు వారిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు జడ్జీల ముందు హాజరుపరిచారు. హైకోర్టుకు సెలవు కావడంతో కుందన్ భాగ్ లోని జడ్జెస్ క్వార్టర్ స్ లోని జడ్జిలు ముందు ప్రొడ్యూస్ చేశారు. జస్టిస్‌‌ ఆర్‌ .ఎస్‌‌.చౌహాన్‌‌, జస్టిస్‌‌ షమీమ్‌‌ అక్తర్‌ బెంచ్.. ఉద్యోగుల వివరణను తీసుకుంది. తమను ఎవరూ నిర్బంధించలేదనివారు తెలిపారు. దీంతో ఆ నలుగురికి స్వేచ్ఛ కలిపించాలని సైబరాబాద్ పోలీసులను బెంచ్ ఆదేశిస్తూ..అశోక్ పిటిషన్ ను కొట్టివేసింది.

ఐటీ గ్రిడ్‌ డైరెక్టర్ ను విచారించాల్సి ఉంది….

ఏపీ ప్రజల వ్యక్తి గత వివరాలు దుర్వినియోగంచేస్తున్నారని హైదరాబాద్ లోని కేపీహెచ్ బీకి చెందిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతోనే తాము కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు బెంచ్ దృష్టికి తెచ్చారు.వారి తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్స్‌‌ సంస్థకు చెందిన ఉద్యోగులను తాము అరెస్ట్‌‌ చేయలేదని, కేవలం160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని వివరించారు.ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్​ ఆరోపిస్తున్నట్లు నలుగురిని కస్టడీ లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.ఇంకా కేసు ప్రాథమిక విచారణలోనే ఉందని, ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ను విచారించాల్సి న అవసరం ఉందని తెలిపారు. రేగొండ భాస్కర్‌ , చంద్రశేఖర్,విక్రమ్ గౌడ్, ఫణిని జడ్జిలు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా విచారించారు.