హైదరాబాద్​లో వదలని వాన

హైదరాబాద్​లో వదలని వాన
  • హైదరాబాద్​లో పలు కాలనీల్లోకి వరద
  • పాలమూరులో మునిగిన పంటలు
  • హిమాయత్ సాగర్, ఉస్మాన్​సాగర్ రెండు గేట్లు ఓపెన్
  • ఇయ్యాల కూడా భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
  • 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటన

హైదరాబాద్/ మహబూబ్​నగర్/ సికింద్రాబాద్, వెలుగు:రాష్ట్రంలో రెండు రోజులుగా జోరుగా వానలు పడుతున్నాయి. ఉమ్మడి పాలమూరు సహా పలు జిల్లాలో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. హైదరాబాద్​లో పలు కాలనీల్లో ఇండ్లలోకి వరదనీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఇక ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురుస్తాయని చెప్పింది. గురువారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

రంగారెడ్డి జిల్లా అమనగల్​లో 11.63 సెం.మీలు, వికారాబాద్ జిల్లా చుక్కాపూర్​లో 11.08 సెం.మీలు, నారాయణపేట జిల్లా గుండ్​మల్​లో 8.6 సెం.మీలు, వనపర్తి జిల్లా సోలిపూర్​లో 7.53 సెం.మీలు, మహబూబ్​నగర్ అర్బన్​లో 6.0 సెం.మీలు, యదాద్రి భువనగిరి జిల్లా నందనంలో 4.45 సెం.మీ లు, ఖమ్మం జిల్లా నాగులవంచలో 4.20 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

పాలమూరులో విస్తారంగా వానలు

ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా 2రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో చెరువుకు గండి పడి వంద ఎకరాల్లో పంట నీటమునిగింది. మక్తల్​లో ఎల్లమ్మకుంట, బసవేశ్వర కాలనీ, రహమానీయా కాలనీలు మునిగిపోయాయి. కోయిల్​సా గర్​ ప్రాజెక్ట్​కు 3500 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా.. 3600 క్యూసెక్కుల అవుట్​ఫ్లో ఉన్నట్లు తెలిపారు. 

హైదరాబాద్​లో 2రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. మరో 3రోజులు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్బీ నగర్ ఏరియాలో కురిసిన వర్షానికి నాగోల్ అయ్యప్ప నగర్ కాలనీలో ఇండ్లలోకి వరద చేరింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిండిపోయాయి. దీంతో గురువారం మధ్యాహ్నం హిమాయత్​సాగర్ 2గేట్లు, ఉస్మాన్​సాగర్ 2గేట్లు 2అడుగులు ఎత్తి నీటిని మూసీనదిలోకి వదులుతున్నారు. సిటీలో అత్యధికంగా నేరెడ్​మెట్​లో 11సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంపల్లిలో 4.5సె.మీ., పటాన్​చెరులో 3.1 సె.మీ. వాన పడింది.

జాగ్రత్తగా ఉండాలి : వాతావరణ శాఖ

జీహెచ్​ఎంసీ పరిధిలో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, 8వ తేదీన ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, చల్లని గాలులు వీస్తాయని, 9న కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, ముసురు పడే చాన్స్​ఉందని తెలిపింది. దీంతో ఈ మూడురోజులు పాటు ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా 20 డిగ్రీల నుంచి 22 డిగ్రీలు, గరిష్టంగా 29 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటాయని వివరించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.