వానాకాలంలో బయట తినకపోవడమే మంచిది

వానాకాలంలో బయట తినకపోవడమే మంచిది

హైదరాబాద్, వెలుగు: చల్లని వాతావరణం,  చిరుజల్లులు కురుస్తుంటే  జనాలు రోడ్ సైడ్ ఫుడ్ తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. వానాకాలంలో  తీసుకొనే ఫుడ్, నీళ్లతో జాగ్రత్తగా ఉండాలని  డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సీజన్‌‌లో బయట ఫుడ్ తినడం మంచిది కాదని ఫుడ్ పాయిజన్​ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. రోడ్ సైడ్ స్టాళ్లలో తినడం తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. సిటీలోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్​పల్లి , మాసబ్‌‌ ట్యాంక్, ఎల్​బీ నగర్  ప్రాంతాల్లో రోడ్ పొడవునా పదుల సంఖ్యలో ఇలాంటి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సాయంత్రం అయితే ఈ ప్రాంతాలన్నీ జనాలతో రద్దీగా కిటకిటలాడుతుంటాయి. ఫాస్ట్ ఫుడ్ నుంచి మిర్చి బజ్జీ, పునుగులు, సమోసాలు, పకోడీలు, టిఫిన్లు, పానీపూరీలు, జిలేబీలు ఇలా రకరకాల స్ట్రీట్ ఫుడ్  ను ఎక్కువగా తింటుంటారు. అయితే వీటివల్ల అనారోగ్యాల బారిన ప్రమాదం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. బయట ఫుడ్ తినడంవల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని, వైరల్ హెపటైటిస్ బారిన పడతారని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.   వర్షాకాలంలో మురికి , దోమలు, ఈగలు ఎక్కువగా పెరగడం,  దీంతో పాటు రోడ్ సైడ్ బండ్ల దగ్గర నూనె ని మార్చి మార్చి వాడటం సాధారణం.  ఇలా పలుమార్లు మరిగించి వాడిన నూనెతో చేసిన ఆహారపదార్థాలు తినడంవల్ల కడుపులోనొప్పి, గ్యాస్ట్రో సమస్యలు వస్తాయని జనరల్ ఫిజిషియన్ డా. నవోదయ తెలిపారు. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని, హైజెనిక్ గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. 

జాగ్రత్తగా ఉండాలి 

ఫుడ్ వాటర్ ద్వారా వైరల్ హెపటైటిస్ వ్యాపిస్తుంది. దీంతో పచ్చకామర్లు, మైల్డ్ ఫీవర్, వాంతులు వచ్చే చాన్స్ ఉంటుంది. వరుస వానలతో కేసులు పెరుగుతున్నాయి. గ్యాస్ట్రో డిపార్ట్​మెంట్​ ఓపీకి వస్తున్న కేసుల్లో 30 నుంచి 40 శాతం ఈ కేసులే ఉంటున్నాయి. అందుకే ఈ సమయంలో హైజెనిక్ ఫుడ్ మెయింటెన్ చేయాలని సూచిస్తున్నాం.

- రాహుల్ దుబ్బాక

 కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్