కాలమేదైనా బస్సు ఎక్కాలంటే కష్టాలే

కాలమేదైనా బస్సు ఎక్కాలంటే కష్టాలే

హైదరాబాద్, వెలుగు: కాలమేదైనా ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడంలేదు. ముఖ్యంగా షెల్టర్లు లేకపోవడంతో వానాకాలంలో రోడ్లమీదనే తడుస్తూ ఎదురుచూస్తున్నారు. సిటీలో అనేకచోట్ల బస్టాండ్లు లేవు. దీంతో రోడ్లమీద నిల్చుని వచ్చిపోయే బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. స్టూడెంట్ల నుంచి పనుల మీద వెళ్లే పెద్దవాళ్ల వరకు గంటగంటలు వర్షపునీళ్లలో నానుతూ అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రయాణాలు చేసేవారికి పాట్లు తప్పడంలేదు. నగరవ్యాప్తంగా అనేక చోట్ల బస్ షెల్టర్లు సరిగా లేకపోవడం, కొన్నిచోట్ల అసలు ఏర్పాటే చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ప్యాసింజర్లు ఇంతలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వర్షంలో తడవడం వల్ల అనోరాగ్యాల పాలవుతారని తెలిసినా సీజన్ రాకముందే ఎందుకు చర్యలు చేపట్టేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు. చాలా చోట్ల రోడ్డు వైండింగ్ లో ఉన్న షెల్డర్లను తీసేశారు. ఇప్పుడు ఏళ్లుగడుస్తున్న కొత్తవాటిని ఏర్పాటుచేయలేదని డైలీ ప్యాసింజర్లు చెప్తున్నారు. అయితే అటు ఆర్టీసీకి, ఇటు జీహెచ్ఎంసీకి మధ్య లోపించిన సమన్వయంతో సిటీలో ఎక్కడెక్కడ సమస్య ఉందనే అంశంపై అధికారులు దృష్టిసారించడంలేదు. నగరవ్యాప్తంగా దాదాపు వెయ్యి బస్టాపులున్నాయి. ఇందులో 800ల బస్టాప్‌లను యాడ్ ఏజెన్సీలకు అప్పగించారు. సిటీలో కొన్ని మినహా మిగతా బస్ స్టాప్‌లన్నీ నామ్ కే వాస్తే అన్నట్లుగా ఉన్నాయి. కూకట్​పల్లి , జేనేఎన్టీయూ, దిల్ షుక్ నగర్, షేక్ పేట్, దర్గా, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డ ఇలా అనేక చోట్ల బస్ షెల్టర్లు లేవు.  జనాలు బస్సుల కోసం రోడ్లమీదనే ఎదురుచూస్తున్నారు. రోడ్లు వైండింగ్ లో ఉన్న బస్ స్టాప్‌లను తీసేయడం, ఆ చోట్ల మళ్లీ ఏర్పాటుచేయకపోవడంతో రోడ్లే బస్‌బేలుగా మారాయి. ఫుట్ పాత్‌లను ఆక్రమించి షాపులు ఏర్పాటుచేసుకోవడంతో రోడ్డుమీదనే నిలబడి బస్సులకోసం పడిగాపులు కాస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు ఏజెన్సీలకు అప్పగించిన షెల్టర్లు వారి ప్రకటనలకు తప్పితే ప్రయాణికులకు మాత్రం ఉపయోగపడని చందంగా మారాయి. బస్‌ స్టాప్‌ల పరిరక్షణ బాధ్యతలను మర్చిపోయి సొంతలాభంకోసం చూసుకుంటున్నారు. బస్‌ స్టాప్‌ల చుట్టుపక్కల చేరిన వర్షపునీరు, చెత్తాచెదారం వాటివల్ల పెరుగుతున్న దోమలతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.