సీఎంను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎర్రబెల్లి

సీఎంను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎర్రబెల్లి
  • బేడ బుడగ జంగం చైతన్య వేదిక సదస్సులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్

బషీర్ బాగ్, వెలుగు: సీఎం కేసీఆర్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సూచించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర బేడ బుడగ జంగం చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి మహాసభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు , శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు  వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆమోదయోగ్యం కానివి ప్రకటించి మభ్యపెట్టాలని చూస్తుందన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనతోనే వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. బేడ బుడగ జంగాలకు రాజకీయంగా అవకాశం కల్పించే విధంగా సీఎంతో మాట్లాడతామని హామీనిచ్చారు.

దళిత బంధు పథకంలో ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తన నియోజకవర్గంలో బేడ బుడగ జంగాల విద్యావంతులు , మేధావులు చాలామంది ఉన్నారని, వారితో తనకు ఎంతో అనుబంధం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.  ఎస్సీ ఉపకులాల్లో రాష్ట్రంలో బేడ బుడగ జంగాలు వెనకబడి ఉన్నారనే సంగతి తెలుసుకొని పోరాడితేనే తెలంగాణ వచ్చిందని హక్కుల సాధన కోసం ఐక్యం కావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ రావు సూచించారు. కార్యక్రమంలో  రాష్ట్ర బేడ బుడగ జంగాల చైతన్య వేదిక ఆల్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. ఆర్.వెంకటేశం , టీజేఏసీ ప్రెసిడెంట్ తూర్పాటి జగదీశ్వర్, కత్తి మల్లయ్య, కోడిగంటి నర్సింహా, సిరిగిరి మన్యం, చింతల గిరితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా  బేడ బుడగ జంగాల నేతలు తరలివచ్చారు.