ఢిల్లీలో భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం

 ఢిల్లీలో భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం

దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన విజృంభించింది. సోమవారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన ధాటికి జనజీవనం స్తంభించింది. ఆగకుండా పడిన భారీ వర్షంతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. ఈదురుగాలులతో చాలా చోట్ల పైకప్పులు లేచిపోయాయి. ఢిల్లీ రోడ్లపై చాలా చోట్ల ట్రాఫిక్ జాం అయ్యింది. AP భవన్ ప్రాంతంలో భారీ వృక్షం కూలిపోవడంతో అక్కడే ఉన్న ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. బలమైన గాలుల వేగానికి ఢిల్లీలోని పలు కార్యాలయాల్లో అద్దాలు పగలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

వాతావరణం అనుకూలించకపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ల్యాండింగ్‌ సమస్యను ఎదుర్కొన్నాయి. అధికారుల నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. భారీ వర్షాల కారణంగా విమానయానశాఖ అప్రమత్తమైంది. పలు విమానాలను ఆలస్యంగా నడుపుతోంది. వాతావరణం సహకరించడం లేదని ప్రయాణికులు అర్థం చేసుకోవాలని ఇండిగో ట్వీట్ చేసింది. 

 

మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. హైదరాబాద్ ప్రాంతంలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. జూన్ 9 తర్వాత రాష్ట్రంలో నైరుతి ఎఫెక్ట్ తో వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 


మరిన్ని వార్తల కోసం..

హత్యకు రేవంత్ కుట్ర చేశారనడం సరికాదు

"9 అవర్స్" వెబ్ సిరీస్ తో వస్తున్న హీరో తారకరత్న