హత్యకు రేవంత్ కుట్ర చేశారనడం సరికాదు

హత్యకు రేవంత్ కుట్ర చేశారనడం సరికాదు

‘నా హత్యకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారు’అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఘాటుగా స్పందించారు. అవి అర్ధరహితమైన వ్యాఖ్యలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి  గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు అందక ఆగ్రహానికి గురైన సామాన్య ప్రజలే.. ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ వద్ద  జరిగిన సభలో ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.  ‘‘ఇది మంత్రి మల్లారెడ్డిపై జరిగిన వ్యక్తిగత దాడి కానే కాదు.. దీన్ని మేం సీఎం కేసీఆర్ పై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నాం’ అని మల్ రెడ్డి రంగారెడ్డి కామెంట్ చేశారు.

మల్లారెడ్డికి సబ్జెక్టు తెలియదు

 ‘నిన్న కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు. మా ఉద్యోగాలు ఏమైనై ? మా నిరుద్యోగ భృతి ఏమైంది ? రైతులకు ఇచ్చిన హామీలు ఏమైనై ? అని ప్రశ్నించారు.  ఇవన్నీ అడిగే సరికి మల్లారెడ్డి మాట మార్చారు. నిరసనకారులు కుర్చీలు, నీళ్ల బాటిళ్లను విసిరారు.  తనను చంపడానికే వాళ్లొచ్చారని మల్లారెడ్డి  అనడం సరికాదు. నిజంగానే చంపడానికి వచ్చి ఉంటే.. కత్తులు, తుపాకులు తీసుకొచ్చేవారు. నీళ్ల బాటిళ్లతో ఎవరైనా చంపడానికి వస్తారా ?’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘మల్లారెడ్డి ముఖ్యమంత్రి ప్రతినిధి గా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబట్టి ఈ దాడిని మేం సీఎం కేసీఆర్ పై జరిగిన దాడిగా భావిస్తున్నాం’’అని చెప్పారు.  ‘‘మల్లారెడ్డికి మొత్తం సబ్జెక్టు తెలియదు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. సబ్జెక్టు లేకుండా వచ్చి మాట్లాడి మల్లారెడ్డి అభాసుపాలైండు. ఈ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని మల్లారెడ్డిపై ప్రజలు చూపించారు. రాష్ట్రంలో ఎక్కడ టీఆర్ఎస్  మీటింగ్ పెట్టినా ఇదే విధమైన తిరుగుబాటు ఎదురవుతుందనే సందేశాన్ని ఈ ఘటన ద్వారా ప్రజలు ఇచ్చారు’’అని మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు..

నిఖత్ జరీన్ కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ సన్మానం

రాకేష్ టికాయత్‌ పై ఇంకు దాడి