ఇండియాలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కిందటేడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో రూ.6,654 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని సాధించింది. అంతకుముందు ఏడాదిలోని డిసెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.6,806 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం తక్కువ. కార్యకలాపాల నుంచి రూ.45,479 కోట్ల రెవెన్యూని సంపాదించింది. ఇది ఏడాది లెక్కన 9 శాతం ఎక్కువ. ఇన్ఫోసిస్ తన రెవెన్యూ గైడెన్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. 2025–26 లో రెవెన్యూ నిలకడైన కరెన్సీ వద్ద 3–3.5 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. మార్జిన్స్ అంచనాను 20–22 శాతం వద్ద కొనసాగించింది. ‘‘ఇన్ఫోసిస్ బలమైన క్యూ3 ఫలితాలను ప్రకటించింది. టోపాజ్ ద్వారా ఎంటర్‌ప్రైజ్ ఏఐలో బలంగా ఉన్నామనే విషయం తెలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లో మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాం”అని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. ‘‘క్లయింట్లు తమ ఏఐ పార్టనర్‌గా ఇన్ఫోసిస్‌ను చూస్తున్నారు. మా ఏఐ సర్వీస్‌లతో వాళ్ల వ్యాపార సామర్ధ్యం మెరుగుపడుతోంది”అని వివరించారు.
కంపెనీ రెవెన్యూ క్యూ3లో నిలకడైన కరెన్సీ వద్ద ఏడాది లెక్కన 1.7 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం 0.6 శాతం పెరిగిందని వివరించారు. కాగా, లేబర్ కోడ్స్ అమలు వలన ఇన్ఫోసిస్‌కి క్యూ3లో రూ.1,289 కోట్ల అదనపు ఖర్చు అయ్యింది. ఈ కారణం వలనే టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ లాభాలు కూడా తగ్గాయి. లేబర్ కోడ్స్ అమలు చేయడం వలన ఐటీ కంపెనీల ప్రాఫిట్స్ 10–20 శాతం వరకు కూడా తగ్గొచ్చని గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ అంచనా వేసిన విషయం తెలిసిందే.
ఆపరేటింగ్ ప్రాఫిట్ 6 శాతం డౌన్..
ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ ప్రాఫిట్(ట్యాక్స్‌లు, వడ్డీలకు ముందు లెక్కించే ప్రాఫిట్) క్యూ3లో రూ.8,355 కోట్లుగా నమోదైంది. ఏడాది లెక్కన 6 శాతం, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 10.7 శాతం తగ్గింది. ఇన్ఫోసిస్ క్యూ3లో 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను దక్కించుకుంది. ఇందులో కొత్త ఆర్డర్ల వాటా 57 శాతంగా ఉంది. డిసెంబర్ క్వార్టర్ ముగిసే నాటికి కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో 915 మిలియన్ డాలర్లు ఉంది.
రెవెన్యూ ఈ సెక్టార్ల నుంచే ఎక్కువ..
ఇన్ఫోసిస్‌కు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ నుంచి ఎక్కువగా రెవెన్యూ వస్తోంది. క్యూ3లో ఈ సెగ్మెంట్ నుంచి వచ్చిన రెవెన్యూ 4.8 శాతం పెరిగింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ నుంచి వచ్చిన రెవెన్యూ 10.8 శాతం పెరగగా, ఎనర్జీ, యుటిలిటీ, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ సెగ్మెంట్లలో గ్రోత్ నెమ్మదించింది. రిటైల్ సెక్టార్ నుంచి వచ్చిన రెవెన్యూ 3.8 శాతం తగ్గింది. గ్లోబల్‌గా రిటైల్ కంపెనీలు తమ టెక్ ఖర్చులు తగ్గించుకోవడమే ఇందుకు కారణం. కమ్యూనికేషన్ సెగ్మెంట్ నుంచి వచ్చిన రెవెన్యూ 11.6 శాతం వృద్ధి చెందింది. ఇన్ఫోసిస్ షేర్లు బుధవారం రూ.1,600 వద్ద ఫ్లాట్‌గా ముగిశాయి.
