సారీ.. గేటు బయట మా పరిధి కాదు !! అద్దాల మేడలో అంతా డొల్ల

సారీ.. గేటు బయట మా పరిధి కాదు !! అద్దాల మేడలో అంతా డొల్ల

సారీ.. గేటు బయట మా పరిధి కాదు !!
అద్దాల మేడలో అంతా డొల్ల
పని చేసేది 1200 మంది 
600 మంది పోలీసుల భద్రత
అయినా ఆగని చోరీలు
కొత్త సెక్రటేరీయట్ తీరిది!!

తెలంగాణ ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు వెచ్చించి హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన కొత్త సెక్రటేరియట్ లో డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల దొంగతనం జరిగింది. ఎల్ ఈడీ లైట్లు, కరెంటు సామగ్రి ఎవరో ఎత్తుకెళ్లారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో అలెర్టయిన పోలీసులు గేటు బయట తమకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. 

సెక్యూరిటీ అంతా డొల్ల

తెలంగాణ సెక్రటేరియట్ ను శత్రుదుర్భేద్యంగా నిర్మించినట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సెక్రటేరియట్ రక్షణ కోసం ప్రభుత్వం ఏకంగా 600 మంది పోలీసుల సేవలను వాడుకుంటున్నది. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నట్టు కూడా చెప్పింది. అయితే ఇవేవీ ఆచరణలో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఎంట్రీ దగ్గర నుంచి ఆరో ఫ్లోర్ వరకు అడుగడుగునా పదుల సంఖ్యలో పోలీసులు దర్శనమిస్తున్నారు.

సీఎం, మంత్రులు వచ్చినపుడు వాళ్లతో వచ్చే గన్ మన్లు, పోలీసులు అదనం. డ్యూటీలో ఉంటున్న వారిలో కొందరు ఏం చేయాలో అర్థం కాక విజిటర్, సీఎంఆర్ ఎఫ్ హాల్ లో వచ్చి కూర్చుంటున్నారు. అంత మంది విధుల్లో ఉంటున్నా సెక్రెటేరియేట్ క్యాంటిన్ , మీడియా సెంటర్, ఇతర ఏమినిటీస్ ఉన్న ప్రాంతంలో దొంగతనం జరిగినా పట్టించుకోవడం లేదు. రోజుకు పది వేలకు పైగా విలువ చేసే కరెంటు వైర్లు , రాడ్లు , స్విచ్ బోర్డులు , ఎల్ ఈ డి లైట్లు చోరీకి గురవుతున్నాయి. అమ్మవారి గుడి, విజిటర్స్ పాస్ హాల్, మీడియా సెంటర్ సెక్రెటేరియేట్ కు సంబంధం లేదని పోలీస్ ఆఫీసర్లు చెబుతున్నారు. 
 
విజిటర్లు, ఉద్యోగులకు తిప్పలు

పోలీసులతో సాధారణ విజిటర్స్ మాత్రమే కాదు.. ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. తమతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఐదారుసార్లు సీఎస్ కు కంప్లయింట్ కూడా చేశారు. ఒకసారి ఏకంగా ఆరో ఫ్లోర్ లో ఒక మహిళా మంత్రిని సైతం పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఇంకో మంత్రిని పోలీస్ చెకింగ్ చేయడం గమనార్హం. సాధారణంగానే లోపలి ఎవరిని అనుమతించని పోలీసులు ... విజిటింగ్ టైమ్ లోనూ వివిధ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న వారిని పాసులు కలిగి ఉన్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.