- మార్కెట్‌ను కిందకి లాగిన ఐటీ..
- ఇన్ఫోసిస్ షేర్లు 6.50 శాతం డౌన్
- నిఫ్టీ ఐదు రోజుల లాభాలకు బ్రేక్
న్యూఢిల్లీ: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఐదు రోజుల లాభాల తర్వాత నష్టపోయాయి. ఐటీ షేర్ల పతనంతో శుక్రవారం అర శాతానికి పైగ పడ్డాయి. నిఫ్టీ 0.64 శాతం తగ్గి 24,013 వద్ద, సెన్సెక్స్ 607 పాయింట్లు పడి 76,803 వద్ద సెటిలయ్యాయి.
ఈ ఇండెక్స్‌లు గత ఐదు రోజుల్లో 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ప్రాఫిట్ బుకింగ్ జరగడం కూడా మార్కెట్ పడడానికి కారణమని ఎనలిస్టులు తెలిపారు. వీటికి తోడు అమెరికా–ఇరాన్ మధ్య శుక్రవారం జరగాల్సిన చర్చలు ఆగిపోవడంతో డీల్‌పై అనిశ్చితి పెరిగిందని అన్నారు. అయినప్పటికీ, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) శుక్రవారం నికరంగా రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
ఐటీ షేర్లు డౌన్
గ్లోబల్ టెక్ కంపెనీ యాక్సెంచర్ తన యాన్యువల్ రెవెన్యూ అంచనాలను తగ్గించడంతో ఐటీ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. ఇన్ఫోసిస్ 6.50 శాతం పతనమవ్వగా, టీసీఎస్, ఎల్‌టీఎం, ఎంఫసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 4 శాతం వరకు పడ్డాయి. ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 77,597.46 కోట్లు తగ్గింది. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ మొత్తం 3.57 శాతం నష్టపోయింది.
