పార్లమెంట్​ ఎన్నికలు ఆలస్యమైతే మజా : హరీశ్​రావు

పార్లమెంట్​ ఎన్నికలు ఆలస్యమైతే మజా : హరీశ్​రావు
  •      అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే  

యాదాద్రి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలలు ఆలస్యమైతే అసలు మజా ఉంటుందని, ఆ లోగా కర్నాటకలో మాదిరిగా తెలంగాణలోనూ కాంగ్రెస్​నిజస్వరూపం బయటపడుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్​రావు అన్నారు. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం భువనగిరిలో బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్​మాట్లాడుతూ.. ఓటమి శాశ్వతం కాదని గెలుపునకు నాంది అని, అసెంబ్లీ ఎన్నికల ఓటమి కూడా స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు.

భువనగిరి ఒక్కటే ఓడిపోలేదని, చాలా చోట్ల ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. క్షమాపణ, మంచితనం, ఓపిక మళ్లా గెలుస్తాయన్నారు. అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో అసహనం మొదలైందని చెప్పారు. రైతు బంధు పడడం లేదని రైతులు అడిగితే.. చెప్పుతో కొట్టాలనడం సంస్కారమా..? అని ప్రశ్నించారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడంతో నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. జిల్లాకు సాగు,  తాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. దళిత బంధుకు మంజూరైన నిధులను రాష్ట్ర సర్కారు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిందన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఫిబ్రవరి1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో జవాబు చెప్పాలన్నారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఏమైందని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ రూ.4 వేలకు ఎందుకు పెంచలేదని, రూ.2వేల ఫింఛన్‌ను కూడా సమయానికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే కొట్లాడుదామన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ..

జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్​రెడ్డి విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరును విమర్శించారు.  ‘‘అధికారం ఉందని విర్రవీగితే చరిత్రలో కలిసిపోతరు. వాళ్లేదో రాజుల్లుగా ఫీలవుతున్నరు. సందీప్ ​అద్భుతంగా మాట్లాడి సమాధానం చెప్పిండు. వాళ్లు రెండు, మూడు కుక్కలను పెట్టుకొని.. పోలీసులను కారులో పెట్టుకొని ఏదో నిమిషం ఎగిరి పరువు తీసుకున్నరు.”అని జగదీశ్​రెడ్డి కామెంట్​చేశారు. రాజులు, నియంతలు కూలిపోయారని చెప్పారు. ​